Constable Duty: ఉద్యోగానికి టైమ్ కి వెళ్ళాలి. అందులోనూ పోలీసు ఉద్యోగం అయితే ఎప్పుడంటే అప్పుడు ఠంచను గా వెళ్లితీరాలి. కానీ ఒక పారామిలటరీ పోలీసు ప్రతి రోజూ డ్యూటీకి ఆలస్యంగా వస్తున్నాడు. అధికారులు చాలాసార్లు మందలించారు. అయినా.. మనోడు టైమ్ కి డ్యూటీకి రావడంలేదు. దీంతో కారణమేమిటో చెప్పు అని అధికారులు అడిగితె సదరు కానిస్టేబుల్ చెప్పిన కథ విని ఆ అధికారులు నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఆ కథనం ఏమిటో తెలిస్తే మీరు కూడా అదే ఎక్స్ ప్రెషన్ ఇస్తారు.
ఉత్తరప్రదేశ్‌లో పనిచేస్తున్న పారామిలిటరీ దళానికి చెందిన ఒక పోలీసు కానిస్టేబుల్ తన భార్య తనను చంపి రక్తం తాగుతున్నట్టుగా ప్రతి రాత్రి పీడకలలు వస్తున్నందున తాను పనికి ఆలస్యంగా వస్తున్నానని లిఖితపూర్వక వివరణ ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని పారామిలిటరీ ఫోర్స్‌లోని 44వ బెటాలియన్‌లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ తరచుగా విధులకు ఆలస్యంగా వస్తున్నాడు. ఫలితంగా, రెజిమెంటల్ అధికారి అతన్ని లిఖితపూర్వక వివరణ ఇవ్వవలసి ఉంటుందని, లేకుంటే శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read: Pakistan Batsman: బ్యాటింగ్ చేస్తూ నిద్రలోకి జారుకున్న పాకిస్తాన్ ఆటగాడు ఔట్..!
Constable Duty: తరువాత, ఆలస్యానికి గల కారణానికి సంబంధించి కానిస్టేబుల్ వ్రాతపూర్వక ప్రతిస్పందన ఇలా ఉంది..
“నా భార్య – నేను ఇటీవల ఒక విషయమై తీవ్రంగా వాదులాడుకున్నాం.. దెబ్బలాడుకున్నాం. అప్పటి నుండి, నా భార్య నా ఛాతీపై కూర్చుని, నా మెడను కొరికి, నా రక్తం తాగుతున్నట్లు నాకు ప్రతిరోజూ కలలు వస్తున్నాయి. దీంతో నాకు టెన్షన్ వచ్చేస్తోంది. అందుకే నాకు నిద్ర పట్టడం లేదు. దీని కోసం నేను ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాను” ఇదీ ఆ కానిస్టేబుల్ ఇచ్చిన రిటన్ రిప్లై.
దీంతో అధికారులకు ఏమి చేయాలో అర్ధం కాక జుట్టు పీక్కున్నారు. కానీ, సోషల్ మీడియా అలా కదుకదా.. ఎలా లీకైందో కానీ, ఆ కానిస్టేబుల్ ఇచ్చిన రిటన్ స్టేట్మెంట్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే భారీ లైకుల్ని.. షేర్స్ ని సొంతం చేసుకున్న ఈ స్టోరీ ఆన్లైన్ లో చూసినవారు.. ఆ కానిస్టేబుల్ పరిస్థితికి జాలి కొందరు వామ్మో చిన్న గొడవకే అతని భార్య కల్లో కూడా పీక్కుతింటుందంటే.. నిజంగా ఎంత గయ్యాళి అయి ఉంటుంది అని కామెంట్ చేశారు.

