Mahaa Conclave

Mahaa Conclave: ఏ రంగానికి ఎంత ఖర్చు చేస్తున్నామనేది ముఖ్యం..ఎంపీ భరత్

Mahaa Conclave: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మహా గ్రూప్ సంస్థల సీఎండీ మారెళ్ల వంశీ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ‘రైజింగ్ ఏపీ మహా కాన్‌క్లేవ్’ లో, రాష్ట్రానికి పెట్టుబడులు, పర్యాటక రంగం మరియు ఉపాధి అవకాశాలపై కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ విశాఖ ఎంపీ మతుకుమిల్లి భరత్, ప్రభుత్వ లక్ష్యాలను, పెట్టుబడి వ్యూహాలను వివరించారు.

నూతన నినాదం.. పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం

గత వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు భయపడ్డారని, వ్యాపారం పెట్టడం రిస్క్‌తో కూడుకున్న పనిగా మారిందని శ్రీభరత్ ఆరోపించారు. అయితే, ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్ నాయకత్వం వారిలో నమ్మకం కలిగిస్తోందని తెలిపారు.

“ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. ఢిల్లీలో మంత్రి లోకేష్‌కు కేంద్రప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండటం, కేంద్రం పాలసీ లెవల్‌లో ఎక్కువ పనిచేయడానికి ఆసక్తి చూపడం రాష్ట్ర అభివృద్ధికి కలిసి వస్తుందని చెప్పారు. గుజరాత్ తరహాలో ఏపీలో స్థిరమైన ప్రభుత్వం ఉంటే వేగంగా అభివృద్ధి జరుగుతుందనే విశ్వాసం కేంద్రమంత్రుల్లో కలిగింది అన్నారు.

పెట్టుబడుల లక్ష్యం: రూ.9.8 లక్షల కోట్లు, 20 లక్షల ఉద్యోగాలు

రాబోయే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు 50 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు అని తెలిపారు. ఈ సదస్సులో 410 ఎంవోయూలు జరిగి, రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి రానున్నాయి. విశాఖకు లక్ష నుంచి లక్షా 50 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని పేరుకున్నారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని భరత్ తెలిపారు.

ప్రతి జిల్లాకు ఒక్కో రంగానికి చెందిన పరిశ్రమలు తీసుకొచ్చి, అమరావతిని క్వాంటమ్ వాలీ కేంద్రంగా, ఉత్తరాంధ్రలో స్టీల్, ఫార్మా, బయోటిక్ రంగాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అని తెలిపారు.

ఇది కూడా చదవండి: Mahaa Conclave: 9లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. మహా వంశీ తో విశాఖ ఎంపీ

సంక్షేమం.. అభివృద్ధిలో సమతుల్యత

రాష్ట్ర అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని భరత్ తెలిపారు. కేవలం సంక్షేమంపై దృష్టి పెడితే రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి సాధించదని, అందుకే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూనే, అభివృద్ధిని కూడా బ్యాలెన్స్ చేస్తున్నామని వివరించారు. ఖర్చు పెట్టేటప్పుడు ఏ రంగానికి ఎంత ఖర్చు చేస్తున్నామనేది ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

పర్యాటకానికి ప్రాధాన్యత.. విశాఖపై ప్రత్యేక దృష్టి

విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని, బీచ్‌లను మరింత స్వచ్ఛంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పర్యాటకానికి భద్రత చాలా ముఖ్యం. దేశంలో పర్యాటకుల భద్రతకు అనుకూలమైన రెండో నగరంగా విశాఖ నిలిచిందని, ప్రధాన నగరాలతో పోల్చుకుంటే విశాఖ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. పర్యాటకం అనేది ఒక అనుభవం అని పేర్కొన్నారు.

రుషికొండ ప్యాలెస్పై కుట్ర ఆరోపణ

రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే ఈ నిర్మాణాన్ని చేపట్టారని, రూ.500 కోట్లతో కేవలం 15 బెడ్‌రూమ్‌లు మాత్రమే నిర్మించారని, దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. చివరగా, ప్రభుత్వ ప్రయత్నాలనికి ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాలి అని భరత్ ప్రజలకు పిలుపునిచ్చారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *