Srisailam: నల్లమల అడవుల్లో భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. మొంథా తుపాను ప్రభావంతో కొండ చరియలు విరిగి రహదారిపై పడ్డాయి. దీంతో రోడ్డు మొత్తం మూసుకుపోవడంతో పోలీసులు అప్రమత్తమై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
ప్రస్తుతం నల్లమల ప్రాంతంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల శ్రీశైలం ఘాట్ రోడ్డు చాలా ప్రమాదకరంగా మారింది. రహదారిపై పెద్ద పెద్ద బండరాళ్లు, మట్టి పెళ్లలు పడ్డాయి. ఈ కారణంగా భక్తులు, ఇతర ప్రయాణికులు శ్రీశైలం వైపు వెళ్లకుండా పోలీసులు పెద్ద డోర్నాల దగ్గర ఉన్న అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను నిలిపివేశారు. ఊహించని ఈ పరిణామంతో అక్కడ పెద్ద సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయితే, పోలీసులు, అటవీశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. రోడ్డుపై పడిన రాళ్లు, మట్టిని తొలగించడానికి పొక్లెయిన్ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. రహదారిని త్వరగా తిరిగి తెరిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రయాణికులు సహకరించి, రోడ్డు పూర్తిగా శుభ్రం అయ్యే వరకు వేచి ఉండాలని అధికారులు కోరుతున్నారు. ప్రయాణం చేసే ముందు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవడం లేదా రోడ్డు పరిస్థితి గురించి తెలుసుకోవడం మంచిదని సూచించారు.

