Kishan Reddy

Kishan Reddy: కాంగ్రెస్‌కు ఓటేస్తే కష్టాలు తప్పవు

Kishan Reddy: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తమ బుద్ధి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. ఎన్నికల హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కు లేదన్నారు.

మంగళవారం జూబ్లీహిల్స్‌ బిజెపి అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా జరిగిన ర్యాలీలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్‌లో సమస్యలు పేరుకుపోయాయని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలైన మహిళలకు నెలకు రూ.2,500, తులం బంగారం, 4 లక్షల ఉద్యోగాలు, దళిత కుటుంబానికి రూ.12 లక్షలు, బీసీ సంక్షేమానికి రూ.లక్ష కోట్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ లాగే రేవంత్‌రెడ్డి కూడా మాటలు చెబుతున్నారని, రాష్ట్రంలో దోపిడీ పెరిగిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థికి మజ్లిస్ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యలు తెలిసిన దీపక్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇక భారత రాష్ట్ర సమితికి ఓటేస్తే అది మూసీ నదిలో వేసినట్లేనని ఎద్దేవా చేశారు.

భారాస, కాంగ్రెస్ ఒక్కటే: బండి సంజయ్‌
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మాట్లాడుతూ, బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని అన్నారు. ఈ రెండు పార్టీల పాలనలో జూబ్లీహిల్స్‌ ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. బిజెపిను ఓడించడానికి దేశమంతా ఎన్నికల్లో పోటీ చేసే మజ్లిస్‌, జూబ్లీహిల్స్‌లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలకు ఎంఐఎంతో లోపాయికారీ అవగాహన ఉందని అన్నారు. కాంగ్రెస్ మీద కోపంతో బీఆర్ఎస్ కు ఓటేయకుండా, బిజెపిను గెలిపించి ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని సంజయ్‌ పిలుపునిచ్చారు.

రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని మంచి పాలన వైపు తీసుకెళ్లేందుకు జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక చాలా ముఖ్యమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. దీపక్‌రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, ఇతర బిజెపి నాయకులు పాల్గొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *