Ponnam Prabhakar

Ponnam Prabhakar: రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు మంత్రి పొన్నం లేఖ

Ponnam Prabhakar: హైదరాబాద్‌–సికింద్రాబాద్ జంట నగరాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్‌కు కీలకమైన లేఖ రాశారు. ఈ లేఖపై జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంతకాలు కూడా ఉన్నాయి.

మంత్రి పొన్నం తన లేఖలో, రక్షణ శాఖ భూములను ప్రజా వినియోగం కోసం తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించేందుకు కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో, రోడ్లు, మౌలిక సదుపాయాలు, మొబిలిటీ ప్రాజెక్టులు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు రక్షణ భూములు అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.

అలాగే, కంటోన్మెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి యూజర్ ఛార్జీల కింద దాదాపు రూ.1,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. ఈ నిధులు విడుదలైతే నగర మౌలిక వసతులు, పౌర సేవల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని మంత్రి వివరించారు.

ఇది కూడా చదవండి: IND vs WI: 12 ఫోర్లు, 2 సిక్సర్లు! జురెల్ తొలి సెంచరీ..

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు గత కొంతకాలంగా జరగకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి పొన్నం, ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా ఈ ఎన్నికలను త్వరగా నిర్వహించాలని రక్షణ మంత్రిని కోరారు.

“హైదరాబాద్ ప్రజల అవసరాలు తీర్చడంలో రక్షణ శాఖ నుంచి వచ్చే సహకారం కీలకమని, భూమి అప్పగింపు ప్రక్రియ వేగవంతం అయితే అభివృద్ధి మరింత ఊపందుకుంటుంది” అని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం రక్షణ భూములను వినియోగించుకునేలా అనుమతించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్, నగర అభివృద్ధి పథకాలు అమలు చేయడంలో రక్షణ శాఖ సహకారం కొనసాగుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *