Komatireddy Raj Gopal Reddy: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య బీఆర్ఎస్ పార్టీలో గెలిచి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఫిరాయింపులపై సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్లడంతో అది రాద్ధాంతమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇదే ఫిరాయింపులపై ప్రస్తుతం అసెంబ్లీలో స్పీకర్ విచారణ కొనసాగుతున్నది. దీంతో తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ కాలె యాదయ్య చెప్పుకుంటున్నారు. ఇప్పుడాయన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దశలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. కాలె యాదయ్యను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Komatireddy Raj Gopal Reddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మొయినాబాద్‌లోని తన ఫార్మ్‌హౌస్‌కు వెళ్తుండగా, అదే మండలంలోని చిలుకూరు వద్ద స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య తారసపడ్డారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సరదా సంభాషణ కొనసాగింది. యాదన్నా కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చనవే.. ఈ ప్రభుత్వంలో అసలు పనులే కావు.. అనవసరంగా వచ్చావు.. అని కాలె యాదయ్యను ఉద్దేశించి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలోకి రావడం వేస్ట్.. అని చెప్పారు.
Komatireddy Raj Gopal Reddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలతో కాలె యాదయ్య కక్కలేక, మింగలేక అన్నట్టు ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిపోయారు. కేవలం చిరునవ్వు సమాధానంగా, ఎలాంటి సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి కాలె యాదయ్య వెళ్లిపోయారు. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గత కొన్నాళ్లుగా అసమ్మతితో రగిలిపోతున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదనే బాధతో ఇలా మాట్లాడుతున్నారని ప్రత్యర్థులు ఆరోపణలు గుప్పిస్తున్నా, ఆయన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదని విమర్శకులు అంటున్నారు. ఈ దశలో కాలె యాదయ్యతో చేసిన సరదా వ్యాఖ్యలు ప్రభుత్వంపై ఎమ్మెల్యేల్లో నెలకొన్న అసంతృప్తిని బయటకొచ్చినట్టయింది.