High Court: తెలంగాణలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలపై తలెత్తిన వివాదం మరో మలుపు తిరగబోతోంది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది.
గ్రూప్–1 ఫలితాలను కొట్టివేస్తూ, సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించిన సింగిల్ జడ్జి తీర్పుతో అసంతృప్తి వ్యక్తం చేసిన వారు కోర్టు తలుపులు తట్టారు. ఇప్పటికే మొత్తం 15 అప్పీళ్లు నమోదయ్యాయి. వీటిలో 12ను టీజీపీఎస్సీ (TSPSC) దాఖలు చేయగా, మిగతా మూడు అప్పీళ్లు అర్హత పొందిన అభ్యర్థులవే.
తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి గానీ, కష్టపడి అర్హత సాధించిన 563మందిని శిక్షించడం న్యాయం కాదు అని అభ్యర్థులు తమ వాదనలో పేర్కొన్నారు. మరోవైపు, టీజీపీఎస్సీ కూడా సింగిల్ జడ్జి ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: ICC: యూఎస్ఏ క్రికెట్ సభ్యత్వంపై ఐసీసీ వేటు.. సస్పెన్షన్ ఎత్తివేయాలంటే..?
మంగళవారం ఒక పిటిషన్‌పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీ. ఎం. మొహియుద్దీన్‌ల ధర్మాసనం, బుధవారం మిగిలిన అన్ని పిటిషన్లను కలిపి విచారణ చేయనున్నట్లు స్పష్టం చేసింది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇక బుధవారం జరిగే విచారణలో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారింది. ఎందుకంటే, ఇది వేలాది ఉద్యోగార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విషయం.