TSPSC Group 1: టీఎస్‌పీఎస్పీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. మెయిన్స్ పరీక్షలో అవకతవకలు జరిగాయని కొందరు అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. ఈ మేరకు గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్టును న్యాయస్థానం రద్దు చేసింది. సరైన విచారణ జరిపి, మళ్లీ పొరపాట్లు పునరావృతం కాకుండా తిరిగి పేపర్లను రీవ్యాల్యుయేషన్ చేయాలని సూచించింది. ఒకవేళ సాధ్యంకాకపోతే మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చింది.
TSPSC Group 1: ఇదిలా ఉండగా, 2023 అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 21 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. 2025 మార్చి 10న టీజీపీఎస్సీ మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక అనుమానాలు తలెత్తాయి. దీనిపై అభ్యర్థులు, నిరుద్యోగులు పోరాటం చేశారు. ఆ తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
TSPSC Group 1: మెయిన్స్ పరీక్షల్లో కొందరు జెల్ పెన్నులు వాడారని, కోఠి ఉమెన్స్ కళాశాలలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఎంపిక కావడం, తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపిక కావడం, కేవలం రెండు కేంద్రాల నుంచే టాపర్లు ఉండటం తదితర అంశాలపై పలువురు అభ్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
TSPSC Group 1: ఆయా అంశాలపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఇరువర్గాల వాదనలను విన్నారు. ఆ తర్వాత తీర్పును వాయిదా వేస్తున్నట్టు సెప్టెంబర్ 7వ తేదీన వెల్లడించారు. ఈ మేరకు ఈ రోజు (సెప్టెంబర్ 9) పైతీర్పునిస్తూ ఆదేశాలను జారీ చేశారు.