SEP 9 AP Historical Day

SEP 9 AP Historical Day: ఆ ఒక్క రాత్రి ఆంధ్ర రాజకీయాలనే మార్చేసింది..!!

SEP 9 AP Historical Day: సెప్టెంబర్ 9, 2023 – ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో సునామీలా మారిన రోజు. ఒక్క రాత్రిలో రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తిరగరాసిన రోజు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లోని ఉక్కు సంకల్పం ఉరుములా పేలిన రోజు. ఆ రాత్రి, ఆ ఘటన – ఒక నాయకుడి కసిని, ఒక పార్టీ శక్తిని, ఒక రాష్ట్ర ఆకాంక్షలను ప్రపంచానికి చాటిన క్షణాలు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార గర్వంలో మునిగిన రోజులవి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ స్కాం ఆరోపణలతో అరెస్ట్ చేసిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును ఏసీబీ అధికారులు ఆకస్మికంగా అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించేందుకు రంగంలోకి దిగారు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌. చంద్రబాబు అరెస్ట్ వార్త తెలియగానే, హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో బయలుదేరేందుకు సిద్ధపడ్డారు. కానీ, అప్పటి వైసీపీ అనుకూల తెలంగాణ ప్రభుత్వం పవన్‌కళ్యాణ్‌ను ఎయిర్‌పోర్టులోనే అడ్డుకుంది. విమానంలో ప్రయాణానికి అనుమతి నిరాకరించబడింది. అయినా, పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గలేదు. “మనల్ని ఎవడ్రా ఆపేది?” అన్న స్ఫూర్తితో రోడ్డు మార్గంలోనే విజయవాడ బయలుదేరారు. కానీ, ఏపీ-తెలంగాణ సరిహద్దులో వైసీపీ పోలీసులు పవన్ కళ్యాణ్‌ను అడ్డుకున్నారు. జనసైనికులపై లాఠీచార్జ్‌తో విరుచుకుపడ్డారు. ఆ క్షణంలో పవన్ కళ్యాణ్ రోడ్డుపై బైఠాయించి, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఎక్కడి నుండి వచ్చారో, ఏ దారులు, ఏరులు దాటుకుని వచ్చారో తెలీదు.. పవన్‌ని నడిరోడ్డుపై నిర్భంధించారన్న వార్త తెలిసిన క్షణాల్లో లక్షలాది జనసైనికులు హోరు వర్షంలోనే అక్కడికి చేరుకున్నారు. పవన్‌ చుట్టూ రక్షణ కవచంలా నిలిచారు. హోరు వర్షంలోనూ, రాత్రి అర్ధరాత్రి సమయంలోనూ, వారి ఆవేశం, అధినేత పట్ల విధేయత రాష్ట్ర ప్రజల్ని కదిలించాయి. ఇది కదరా అభిమానం అంటే! వీళ్లు కదరా నిజమైన ఫ్యాన్స్‌ అంటే! అంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు టీవీలకు హత్తుకుపోయి ఆ ఉత్కంఠభరితమైన దృశ్యాలను సంభ్రమాశ్చర్యాలతో వీక్షించారు. ఆనాడు “వైసీపీని కూకటివేళ్లతో పెకిలిస్తాం!” అంటూ నడిరోడ్డుపై బైఠాయించి పవన్‌ చేసిన శపథం నవ్యాంధ్ర రాజకీయాన్ని మలుపు తిప్పిన ఘటనగా నిలిచింది.

Also Read: Asia Cup 2025: నేటి నుంచి ఆసియా కప్ 2025.. పూర్తి షెడ్యూల్ ఇదే!

ఈ ఘటన తర్వాత, పవన్ కళ్యాణ్ వెనక్కి తిరిగి చూడలేదు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. తెలుగుదేశంతో పొత్తు ప్రకటించారు. బిజెపిని కూడా ఒప్పించి, బలమైన కూటమిని నిర్మించారు. 2024 ఎన్నికల్లో ఈ కూటమి ప్రభంజనం సృష్టించింది. వైసీపీ అధికార గర్వాన్ని మట్టికరిపించి, రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తిరగరాసింది. సెప్టెంబర్ 9 ఘటనకు రెండేళ్లు గడిచినా నేటికీ, ఆ రోజు దృశ్యాలు సోషల్ మీడియాలో ఒక ప్రభంజనంలా వైరల్‌ అవుతుండటం విశేషం. వైసీపీ అధికార మదం ఆనాడు ఎదురులేని ఫోర్స్‌గా దూసుకు వస్తున్న జనసేనని దుస్సాహసంతో నిర్భంధించాలని చూసింది. మరో సందర్భంలో విశాఖ నోవాటెల్‌లో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ని మూడు రోజులు నిర్భందించింది. ఎయిర్‌పోర్టులో జనసైనికులను వికృత చేష్టలతో కవ్వించింది. జనసేన వీరమహిళలపై కూడా అన్యాయంగా అక్రమ కేసులు బనాయించింది. ఈ దుర్మార్గాలన్నీ వైసీపీకి వినాశకరమైన ఫలితాలను తెచ్చిపెట్టాయని చెప్పొచ్చు.

జనసేనకు సంబంధించినంత వరకూ సెప్టెంబర్ 9 కేవలం ఒక తేదీ కాదు. ఒక ఉద్యమాన్ని రగిల్చిన పతాక సన్నివేశం. పవన్ కళ్యాణ్ ధైర్యం, జనసైనికుల సంకల్పం, కూటమి ఐక్యతకు నాంది పలికిన రోజు. వైసీపీ పతనానికి, ఆంధ్రప్రదేశ్ ఆశలకు బీజం వేసిన రోజు. ఈ రోజు జనసేన చరిత్రలో, ఏపీ రాజకీయాల్లో ఎప్పటికీ మరచిపోలేనిదిగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *