Kaleshwaram Project

Kaleshwaram Project: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ..

Kaleshwaram Project: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులో చోటుచేసుకున్న భారీ అవినీతి, వైఫల్యాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ జరపాలని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఆదివారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో సుదీర్ఘ చర్చ అనంతరం ఈ సంచలన ప్రకటన వెలువడింది.

సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, “కేంద్ర సంస్థలైన ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కావడంతో, సీబీఐ దర్యాప్తు మాత్రమే పారదర్శకతకు నిదర్శనం అవుతుంది” అని స్పష్టం చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ప్రాజెక్టు వ్యయం రూ.38 వేల కోట్ల నుంచి రూ.1.47 లక్షల కోట్లకు పెరిగిందని, కాంట్రాక్టర్ల కమీషన్ల కోసం ప్రాజెక్టు స్థలాన్ని మార్చినట్టు ఆరోపించారు.

జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదికలో ఘోర అవకతవకల వెల్లడి

జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలోని కమిషన్‌ తమ నివేదికలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం, కాంట్రాక్టు ఏజెన్సీల పాత్రను బహిర్గతం చేసిందని సీఎం పేర్కొన్నారు. ఈ నివేదికను జులై 31న ప్రభుత్వం స్వీకరించి, ఆగస్టు 4న కేబినెట్‌ ఆమోదించినట్టు తెలిపారు. ఎన్‌డీఎస్‌ఏ, కాగ్‌, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాల నివేదికలు కూడా భారీ లోపాలను బయటపెట్టాయని గుర్తుచేశారు.

“ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చడం వల్లే ప్రజాధనం వృథా అయ్యింది. రూ.లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకుపోయాయి. ఈ కుట్ర వెనుక ఉన్న వారిని తప్పనిసరిగా శిక్షిస్తాం,” అని రేవంత్‌ హెచ్చరించారు.

అసెంబ్లీలో 9 గంటల సుదీర్ఘ చర్చ

కాళేశ్వరం అంశంపై ఆదివారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు జరిగిన చర్చలో అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఆ తరువాతే సీబీఐ దర్యాప్తు అవసరమని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం వెల్లడించారు.

జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ప్రవేశపెట్టిన అనంతరం ప్రతిపక్ష నేతల విమర్శలకు సీఎం సమాధానమిస్తూ, గత ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు కోర్టును ఆశ్రయించి కమిషన్‌ పనిని అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. “ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం నేరస్తులను వదలమని” ఆయన పునరుద్ఘాటించారు.

సీఎం ప్రకటన అనంతరం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు.

ALSO READ  Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *