Babu Kodukochadu: చంద్రబాబు నాయుడు పొలిటికల్ కెరీర్ నేటికి 45 ఏళ్లు. ఎన్నో ఎత్తు పల్లాలు చూశారాయన. నాలుగో సారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే గత మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కంటే.. ఈ సారి ఎవరూ ఊహించని స్పీడ్ ఆయన పాలనలో కనిపిస్తోంది. సాధారణంగా సీఎం చంద్రబాబుకు ఓ బ్యాడ్ నేమ్ ఉంది. ఆయన ఓ 20 ఏళ్లు ముందుచూపుతో ఆలోచిస్తూ, ప్రసెంట్‌లో చేయాల్సిన రాజకీయం మిస్ అవుతుంటారని. పాతికేళ్లు ముందు చూపుతో ఆలోచిస్తే సరిపోదు. ఆ విజన్‌ని ఆచరణలో సాధ్యం చేసి చూపాలంటే పాతికేళ్లు కంటిన్యూగా అధికారంలో ఉండాలి. ఉదాహరణకు 2014లో గెలిచిన తర్వాత, 2019లోనూ చంద్రబాబు పాలన కొనసాగి ఉంటే ఇప్పటికి పోలవరం చేతికి అందివచ్చేది, అంతర్జాతీయ స్థాయి రాజధాని అమరావతి కల సగమైనా సాకారం అయ్యేదని ఎవరైనా అంగీకరించే మాట. అయితే నేడు పూర్తిగా మారిన చంద్రబాబును చూస్తున్నారు. కనీసం 15 ఏళ్లు ఒక ప్రభుత్వం కొనసాగాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించారు, అదే నొక్కి చెప్తున్నారు. ఇదొక మార్పు. ఇక అధికారంలోకి రాగానే ఐటీ కంపెనీస్, ఇండస్ట్రీస్, రియల్‌టైమ్ గవర్నెన్స్, ఎకనామిక్స్, ఫైనాన్సియల్ సస్టైనబులిటీ, ఎన్విరాన్వెంట్ ఫ్రెండ్లీ అంటూ అభివృద్ధి జపం చేస్తారు తప్ప… సంక్షేమ హామీలను నత్త నడకన అమలు చేస్తారనే అపవాదు కూడా ఉండేది.
కానీ నేడు సంక్షేమంలోనూ తగ్గేదేలే అంటున్నారు. ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ప్రామిస్ చేసినప్పుడు.. ఇప్పటికి ఉన్న సంక్షేమ పథకాలే తలకు మించిన భారంగా మారాయని, ఇక ఈ సూపర్ సిక్స్ ఎక్కడ అమలవుతాయంటూ నిట్టూర్పులే వినిపించాయి. తిప్పికొడితే 14 నెలల్లోనే 4 సూపర్ సిక్స్ హామీలు అమలు చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్లతో మొదలు పెట్టి, తల్లికి వందనంతో సంచలనం సృష్టించి, రైతు భరోసా అమలు చేసి, తర్వాత నెల తిరక్కుండానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ బాబు గారు అంటూ మొదలు పెట్టిన వైసీపీకి.. ఇది దిమ్మ తిరిగే షాక్. ఎందుకంటే ఐదేళ్లకు కానీ చంద్రబాబు సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా మొదలు పెట్టరనే ధీమా వైసీపీది. ఆ ధీమా నేడు పటాపంచలైంది. ఇది ఇంకొక మార్పు. ఇదంతా చంద్రబాబులో ఆయన ప్రత్యర్థులతో పాటూ, ప్రజలు చూస్తున్న మార్పు. ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే.. యువనేత లోకేష్ ఆలోచనల ప్రభావం వల్లే చంద్రబాబులో ఈ మార్పు అన్న అభిప్రాయం వినబడుతోంది.
Also Read: Rahul Gandhi: నేటి నుంచి రాహుల్ ఓటర్ అధికార్ యాత్ర..
నారా లోకేష్ మొదటి నుండీ టీడీపీ పార్టీ వ్యవహారాల్లో యాక్టివ్‌గానే ఉండేవారు కానీ.. పాలనలోనూ, పార్టీ వ్యవహారాల్లోనూ నిర్ణయాలన్నీ చంద్రబాబు, ఆయన టీమే తీసుకునే వారని చెబుతారు. అయితే 2019లో ఓటమి తర్వాత యువనేత నారా లోకేష్ రాజకీయం పార్టీకి అవసరమైంది. పాదయాత్రతో తనని తాను ప్రజల్లో ఫ్రూవ్ చేసుకోవడంతో పార్టీలోనూ పట్టు చేజిక్కించుకోవడం సులభమైంది. రాజారెడ్డి, ఆయన వారసుడు రాజశేఖర్ రెడ్డితో రాజకీయంగా పోటా పోటీగా కొట్లాడిన చంద్రబాబు.. వైఎస్‌స్సార్ వారసుడు జగన్ రాజకీయం ముందు చతికిల పడటానికి కారణం.. ప్రధానంగా జనరేషన్ గ్యాప్. దానివల్లే జగన్ మనస్థత్వాన్ని, రాజకీయాన్ని చంద్రబాబు అంచనా వేయలేకపోయారని చెప్పాలి. ఇప్పుడు జగన్ లాంటి వ్యక్తితో తలపడి రాజకీయం చేయాలంటే చంద్రబాబులా స్మూత్‌గా ఉంటే పని జరగదు. రఫ్ అండ్ టఫ్ పాలిటిక్స్ చేయాలి. నిన్న కాక మొన్న పులివెందులలో లోకేష్ చేసింది కూడా అదే. ఇక జగన్ ఇమేజ్ సంక్షేమ పథకాల చుట్టూ బిల్డ్ అయ్యింది.
దాన్ని దెబ్బకొట్టేందుకే సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తోంది టీడీపీ ప్రభుత్వం. ఫ్యాక్షన్ మూలాలున్న పార్టీని కంట్రోల్ చేయాలంటే రెడ్‌బుక్ లాంటి వెపన్ ప్రయోగించాల్సిందేనని, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించేందుకు అరెస్టులు చేస్తే తప్పు కాదని, అవి ఏమాత్రం కక్ష పూరిత రాజకీయాలు కావని చంద్రబాబు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం వెనుక లోకేష్ ఆలోచనలే కారణమని చెప్పాలి. లేకుంటే బాబు హయాంలో ఇన్ని అరెస్టులు జరుగుతాయని వైసీపీనే ఊహించి ఉండదు. ఏ వ్యవస్థలో అయినా ఎప్పటికప్పుడు కొత్త రక్తం వచ్చి చేరుతుంటేనే ఆ వ్యవస్థ కాలానికి అనుగుణంగా పరిస్థితులను తట్టుకుని నిలబుడుతుంది. నేడు టీడీపీలో కనిపిస్తున్న మరో మార్పు అదే. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా ఆయన చుట్టూ కోటరీ వచ్చి చేరేది. వారంతా ఏసీ గదుల్లో కూర్చుని సలహాలు ఇచ్చేవారు. నేడు ఆ కోటరి స్థానంలో లోకేష్ టీమ్ వచ్చి చేరింది. వీరంతా గ్రౌండ్ లెవెల్‌లో కార్యకర్తలు, ప్రజలతో మమేకమైన లీడర్లు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. మారిన చంద్రబాబు, మార్చింది లోకేష్ బాబు అని చెప్పాల్సొస్తుంది. ఏది ఏమైనా.. ఇప్పుడు టీడీపీ వర్గాల్లో ఒక్కటే మాట వినిపిస్తోంది. “ఇక్కడున్నది చంద్రబాబు కాదు.. ఆయన కొడుకొచ్చాడు.”