Indigo Flight: ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడు మరో ప్రయాణికుడిపై దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చెంపదెబ్బ తిన్న ప్రయాణికుడు అస్సాంకు చెందిన హుస్సేన్ అహ్మద్ మజుందార్ (32) అదృశ్యమైనట్లు అతని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగినప్పటి నుండి అతని ఆచూకీ తెలియడం లేదని వారు తెలిపారు.
గురువారం 6E-2387 ఇండిగో విమానం ముంబై నుండి కోల్‌కతా మీదుగా సిల్చార్‌కు బయలుదేరింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న హుస్సేన్ అహ్మద్ మజుందార్‌కు తీవ్రమైన పానిక్ అటాక్ వచ్చింది. విమాన సిబ్బంది అతనికి సహాయం చేస్తుండగా, పక్క సీటులో ఉన్న హఫీజుల్ రెహమాన్ అనే ప్రయాణికుడు ఆగ్రహంతో హుస్సేన్ చెంపపై కొట్టాడు. ఈ ఘటనను మరో ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. విమాన సిబ్బంది దాడి చేసిన వ్యక్తిని వారించినప్పటికీ, హుస్సేన్ మరింత కలత చెందారు.
అదృశ్యంపై కుటుంబసభ్యుల ఫిర్యాదు:
ముంబైలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్న హుస్సేన్, తరచుగా ఇదే మార్గంలో ఇంటికి వస్తుంటాడు. శుక్రవారం ఉదయం హుస్సేన్‌ను సిల్చార్ విమానాశ్రయంలో కలిసేందుకు వెళ్ళిన కుటుంబ సభ్యులకు అతను కనిపించలేదు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండటంతో ఆందోళన చెందారు. తర్వాత వైరల్ అయిన వీడియో ద్వారా హుస్సేన్‌పై జరిగిన దాడి గురించి తెలుసుకున్నారు. హుస్సేన్ తండ్రి అబ్దుల్ మన్నన్ మజుందార్ మాట్లాడుతూ, తమ కుమారుడి ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా తెలియరాలేదని చెప్పారు. దీనిపై విమానాశ్రయంలోని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) అధికారులకు, స్థానిక ఉదర్‌బాండ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు.
Also Read: Balakrishna: 13న అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి భూమిపూజ
పోలీసులు కోల్‌కతా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని కాచర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) నుమల్ మహత్తా తెలిపారు. సీఐఎస్‌ఎఫ్ మధ్యవర్తిత్వం తర్వాత హుస్సేన్ అహ్మద్, దాడి చేసిన వ్యక్తి జూలై 31న కోల్‌కతా విమానాశ్రయం నుండి వెళ్లడానికి అనుమతించబడ్డారని ఆయన అన్నారు. హుస్సేన్ మరుసటి రోజు కోల్‌కతా నుండి సిల్చార్ విమానం ఎక్కాల్సి ఉన్నప్పటికీ, అది తప్పిపోయారని, శనివారం కూడా అతను ఏ విమానంలో ప్రయాణించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, దాడికి పాల్పడిన హఫీజుల్ రెహమాన్‌ను కోల్‌కతాలో దిగగానే భద్రతా సిబ్బందికి అప్పగించామని తెలిపింది. అతడిని నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తిగా గుర్తించి, ఇతర ఎయిర్‌లైన్ ఏజెన్సీలకు కూడా సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది. అయితే, చెంపదెబ్బ తిన్న హుస్సేన్ అహ్మద్ మజుందార్ ఆచూకీ గురించి మాత్రం ఇండిగో తన ప్రకటనలో ప్రస్తావించలేదు. హుస్సేన్ మానసికంగా బలహీనంగా ఉన్న సమయంలో ఈ ఘటన అతనిపై తీవ్ర ప్రభావం చూపి ఉంటుందని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.