Kavita: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘మన రాష్ట్రానికి ఫ్లైట్ మోడ్ సీఎం దక్కాడు. ఆయన ఢిల్లీకి వెళ్లడం నిత్యకృత్యంగా మారింది. ఇప్పటివరకు అర్ధ సెంచరీ పూర్తయింది,’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజాగా కూడా సీఎం ఢిల్లీకి బయలుదేరిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత, ‘‘ఇంతసార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ ఒక్కసారైనా బీసీ రిజర్వేషన్ల గురించి ప్రధాని మోదీతో చర్చించారా? ఆయన బీసీలకు న్యాయం చేయాలంటే అన్ని పార్టీల నాయకులను తీసుకెళ్లి ఢిల్లీలో గళమెత్తాలి,’’ అని సూచించారు.
రాష్ట్రంలో పార్టీ ప్రాతినిధ్యంపై రిజర్వేషన్లను ప్రకటించడాన్ని విమర్శించిన ఆమె, ‘‘బీసీలు పార్టీ పరంగా కాక, చట్టబద్ధమైన రిజర్వేషన్లు కోరుతున్నారు. వాటిని అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే, బీసీలు ఊరుకోరని’’ హెచ్చరించారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీలు రెండూ ప్రజలను మోసం చేస్తున్నాయని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బీసీ రిజర్వేషన్ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే ఆమోదించింది. కానీ కేంద్రం రాష్ట్రపతికి పంపే విషయంలో ఆలస్యం చేస్తోంది. బిల్లును మతపరమైన కోణంలో చూస్తూ బీజేపీ పాస్ చేయడం లేదని’’ విమర్శించారు.
‘‘గుజరాత్‌లో బీసీలకు ఎలా రిజర్వేషన్లు ఇచ్చారో అందరికీ తెలుసు. కానీ అదే విషయంలో తెలంగాణకు వేరు వేరు న్యాయాలు ఎందుకు? ఉత్తరాది రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలవుతుంటే, దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం న్యాయస్థానాలు అడ్డంకులని బీజేపీ సాకులు చెబుతోంది. బీసీ బిడ్డలను తక్కువ చేయాలనే కుట్రదే ఇది,’’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.