Perni Nani Plans: వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన మాటలు, చర్యలు, వైఖరి వైసీపీ క్యాడర్‌లోనే అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. ఒకవైపు ధైర్యసాహసాలతో రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ, మరోవైపు ఊహించని విధంగా ప్రత్యర్థి నాయకులను పొగడ్తలతో ముంచెత్తడం ద్వారా పేర్ని నాని రాజకీయ వ్యూహం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అస్థిరమైన వైఖరి వెనుక ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారా లేక పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ఈ వ్యవహారం సాగుతోందా అన్న అనుమానాలు రాజకీయ పరిశీలకులను కలవరపెడుతున్నాయి.
పేర్ని నాని వ్యవహారశైలి రాజకీయ విశ్లేషకులకు సవాలుగా మారింది. ఒక సందర్భంలో ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని “మంచి సీఎం”గా కీర్తిస్తూ, చంద్రబాబు మహిళల్ని అరెస్ట్ చేయొద్దన్నారని, దటీజ్ చంద్రబాబు అంటూ ప్రెస్మీట్‌లోనే పొగిడేస్తారు. అదే సమయంలో, “దమ్ముంటే అరెస్టు చేయండి, మా కేశాలు కూడా ఊడవు” అంటూ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతూ దూకుడుగా వ్యవహరిస్తారు. ఇక, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై “దేవుడు సిగ్గనేదే ఇవ్వలేదా” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, జనసైనికుల ఆగ్రహాన్ని రెచ్చగొడతారు. ఇలాంటి వైరుధ్య వ్యాఖ్యలు, చర్యలు వైసీపీ క్యాడర్‌లోనే గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.
ఇటీవల ఓ సందర్భంలో, “చీకట్లో కన్ను కొడితే పని జరిగిపోతుంది” అంటూ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడిన పేర్ని, కేసుల భయం తలెత్తగానే “నేను సైకో రాజకీయాలు చేయొద్దని మాత్రమే చెప్పాను” అంటూ వెనక్కి తగ్గారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ రాజకీయ వ్యూహాన్ని “సైకో రాజకీయాలు”గా అభివర్ణిస్తున్నాయా అన్న ప్రశ్నలు క్యాడర్‌లోనే ఉద్భవిస్తున్నాయి. ఈ వైరుధ్యాలు జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతోనే జరుగుతున్నాయా లేక పేర్ని స్వతంత్రంగా తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అన్నది స్పష్టంగా తెలియడం లేదు.
Also Read: Macherla Lo Marpu: జూలకంఠి బ్రహ్మా రెడ్డి రాజకీయం ఊహాతీతం..
Perni Nani Plans: రాజకీయ విశ్లేషకులు పేర్ని నాని వ్యవహారంలో లోతైన రాజకీయ వ్యూహం ఉందని అనుమానిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా పేర్ని, పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేస్తూ, జనసైనికుల ఆగ్రహాన్ని రెచ్చగొట్టడం ద్వారా కాపు-కమ్మ రాజకీయ విభేదాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం ద్వారా, టీడీపీ-జనసేన పొత్తును బలహీనపరచడం, రానున్న ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంకును వైసీపీ వైపు మళ్లించడం లక్ష్యంగా ఉందా అన్న చర్చ జరుగుతోంది. టీడీపీ క్యాడర్ సాంప్రదాయకంగా క్రమశిక్షణతో వ్యవహరిస్తుంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తక్షణం స్పందించకుండా సంయమనం పాటిస్తారు. అయితే, జనసేన క్యాడర్, ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులు భిన్నంగా స్పందిస్తారు. పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు జనసైనికులు దూకుడుగా స్పందించే అవకాశం ఉంది. దేహశుద్ధి చేసినా ఆశ్చర్యం లేదు. ఈ పరిస్థితిని పేర్ని నాని తనకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తున్నారా అన్నది ప్రశ్న.
పేర్ని నాని రాజకీయ వ్యవహారం వెనుక స్పష్టమైన వ్యూహం ఉందా? లేక గందరగోళ వైఖరి మాత్రమేనా? అన్నది రాజకీయ విశ్లేషకులకు అంతుపట్టని విషయంగా మారింది. ఆయన వ్యాఖ్యలు వైసీపీ అధినాయకత్వంతో సమన్వయంతో జరుగుతున్నాయా లేక వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారా అన్నది సమయమే నిర్ణయిస్తుంది. అయితే, టీడీపీ-జనసేన కూటమి ఈ రాజకీయ కుట్రలకు ఎలా స్పందిస్తుంది, పేర్ని నాని వ్యవహారం వైసీపీకి ఎలాంటి రాజకీయ ప్రయోజనాన్ని తెస్తుందన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఈ రాజకీయ నాటకం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.