Assam:భార్యాభర్తల బంధాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. వివాహ బంధాలను కాదనుకొని వివాహేతర బంధాలకే విలువనిస్తూ, కట్టుకున్న వాడినీ, కన్నవారినీ వదిలేందుకే సిద్ధపడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా తరచూ జరుగుతున్నాయి. పలుచోట్ల కట్టుకున్నవారినీ, కడుపున పుట్టిన వారినీ కడతేర్చే హత్యోదంతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కుటుంబ బంధాన్ని వదిలేసి వెళ్లిన ఓ మహిళతో విడాకులు రావడంతో పునర్జన్మ లభించిందన్న భావంతో ఆమె భర్త పాలతో స్నానం చేసిన వినూత్న ఘటన అస్సాం రాష్ట్రంలో చోటుచేసుకున్నది.
Assam:అస్సాం రాష్ట్రం నల్బాడీ జిల్లా ముకుల్మువా గ్రామంలో మాణిక్ అలీ తన భార్యా, కూతురుతో కలిసి నివాసం ఉంటున్నారు. అతని భార్య గతంలో రెండు సార్లు తన ప్రియుడితో పారిపోయి వచ్చింది. పెద్దల సూచన, కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా, తన బిడ్డ భవిష్యత్తు కోసం మాణిక్ అలీ తన భార్యతో కలిసి ఉండటానికి ఇష్టపడ్డాడు.
Assam:మాణిక్ అలీ భార్య తన ప్రియుడితో తరచూ వెళ్లసాగింది. ఈ విషయంపై విసుగు చెందిన అలీ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. కోర్టు నుంచి విడాకులు మంజూరయ్యే నాటికి అతని భార్య తన ప్రియుడితోనే ఉన్నది. ఈ సమయంలో మాణిక్ అలీ పునర్జన్మ లభించినట్టుగా భావించాడు. 40 లీటర్ల పాలతో స్నానమాచరించాడు. ఇప్పటి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానని, దానికి గుర్తుగానే పాలతో స్నానం చేశానని మాణిక్ అలీ ఇరుగు పొరుగుకు చెప్పుకున్నాడు.