US Visas: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇటీవలి కాలంలో తాత్కాలికంగా ఆగిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే, అమెరికా ప్రభుత్వం కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇకపై, వీసా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా తనిఖీ (Social Media Vetting) చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
సోషల్ మీడియా తనిఖీలు ఎందుకు?
అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, “సోషల్ మీడియా వెట్టింగ్” ద్వారా అమెరికాలోకి ప్రవేశించాలనుకునే ప్రతి వ్యక్తిని పూర్తిగా పరిశీలించే అవకాశం లభిస్తుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను యూఎస్ కాన్సులర్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇందుకోసం దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైళ్ల ప్రైవేట్ సెట్టింగ్స్‌ను మార్చుకుని ‘పబ్లిక్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలని సూచించారు.
‘సోషల్ మీడియా వెట్టింగ్’ అంటే ఏమిటి?
వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వాలా వద్దా అని నిర్ణయించడానికి వారి ఆన్లైన్ కార్యకలాపాలను అధికారులు తనిఖీ చేయడాన్ని ‘సోషల్ మీడియా వెట్టింగ్’ అంటారు. విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. ఉదాహరణకు, ఒక విద్యార్థి తమ సోషల్ మీడియా ఖాతాలో పాలస్తీనా జెండాను పోస్ట్ చేసినట్లయితే, ఆ వ్యక్తిని మరింత లోతుగా పరిశీలిస్తారు. వారి వల్ల దేశ భద్రతకు ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతే వారిని అమెరికా విద్యాసంస్థల్లో చదువుకోవడానికి అనుమతిస్తారు విద్యార్థి వీసా మంజూరు చేస్తారు.
Also Read: Sharmila Reddy : ‘జగన్ హత్యాచారాలు’ అని షర్మిల ఎందుకన్నారు?
US Visas: గత మే చివరి వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్త విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. వీసాల జారీకి అవసరమైన సామాజిక మాధ్యమ ఖాతాల పరిశీలనకు సన్నాహాలు చేస్తున్నందువల్లే ఈ నిలిపివేత జరిగిందని అప్పట్లో విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పుడు, ఈ సోషల్ మీడియా వెట్టింగ్‌ను తప్పనిసరి చేస్తూ వీసా అపాయింట్మెంట్ల ప్రక్రియను పునరుద్ధరించింది.
ఈ కొత్త నిబంధనలు అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు మరింత పారదర్శకతను తీసుకువస్తాయని, అదే సమయంలో అమెరికా భద్రతా ప్రయోజనాలను పరిరక్షిస్తాయని భావిస్తున్నారు. విద్యార్థులు తమ సోషల్ మీడియా ఖాతాల గోప్యతా సెట్టింగ్‌లను సరిచూసుకోవడం ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేయవచ్చు.