Sharmila Reddy: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌తో పాటు, తన భర్త, సన్నిహితుల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయని, ఈ విషయం నిజమని బైబిల్‌పై ప్రమాణం చేసి చెప్పగలనని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ కేసులో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, కేసీఆర్‌లు కలిసి తనను రాజకీయంగా, ఆర్థికంగా అణచివేసేందుకు కుట్ర పన్నారని షర్మిల ఆరోపించారు. ఈ వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి పాత్ర కీలకంగా ఉందని షర్మిల వెల్లడించారు. తన ఫోన్ ట్యాప్ చేయబడిన విషయాన్ని సుబ్బారెడ్డి స్వయంగా తన ఇంటికి వచ్చి చెప్పారని, ట్యాప్ చేసిన ఆడియోను కూడా వినిపించారని ఆమె బాంబు పేల్చారు. అయితే, ఇప్పుడు సుబ్బారెడ్డి ఈ విషయాన్ని ఒప్పుకుంటాడా అన్నది సందేహమేనని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే జగన్ రెడ్డి తన సొంత మేనల్లుడు, మేనకోడలు ఆస్తి కాజేయడానికి, వారి అస్తిత్వాన్ని ధ్వంసం చేయడానికి వైవీ సుబ్బారెడ్డితో గతంలో అనేక అబద్ధాలు చెప్పించారని షర్మిల ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎక్కడికైనా వెళ్లి సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమని, ఏ విచారణనైనా ఎదుర్కొంటానని షర్మిల సవాల్ విసిరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులు ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని కోరారు. జగన్, కేసీఆర్‌ల మధ్య అప్పట్లో ఉన్న సన్నిహిత సంబంధం రక్త సంబంధాన్ని కూడా చిన్నబోయేలా చేసిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి తనను రాజకీయంగా బలహీనపరిచేందుకు ఫోన్ ట్యాపింగ్‌ను ఒక ఆయుధంగా ఉపయోగించారని ఆమె ఆరోపించారు. షర్మిల ఆరోపణలు కేవలం ఫోన్ ట్యాపింగ్‌తోనే ఆగలేదు. జగన్ తనపై చేసిన దాడులు, కుట్రలు ఇంతకంటే ఘోరమైనవని ఆమె పేర్కొన్నారు. చెల్లినని చూడకుండా, వైఎస్సార్ కుమార్తెనని కూడా గుర్తించకుండా, తనపై, తన తల్లి విజయలక్ష్మిపై నీచ ప్రచారాలకు ఒడిగట్టారని గుర్తు చేశారు షర్మిల. జగన్ చేసిన “హత్యాచారాల” ముందు ఫోన్ ట్యాపింగ్ చాలా చిన్న విషయమన్నారు. ఈ కేసులో నిజాలు బయటకు రావాలని, విచారణ త్వరగా పూర్తికావాలని ఆమె డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్‌పై షర్మిల ఆరోపణలు ఎలా ఉన్నా.. తన వ్యాఖ్యల్లో ఆమె ఉపయోగించిన కొన్ని పదాలు ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి. “బైబిల్ మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నా ఫోన్లు ట్యాప్ చేసిన మాట వాస్తవం” అని పేర్కొన్న షర్మిల… మరి ఆ నాడే ఎందుకు బయటపెట్టలేదు అన్న అనుమానాలకు వివరణ ఇచ్చారు. ఆనాడు తాను ఉన్న పరిస్థితుల్లో.. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ దుర్మార్గాల ముందు ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద అంశం కాదని భావించానని తెలిపారు. ముఖ్యంగా చెల్లినని చూడకుండా, వైఎస్సార్ బిడ్డనని చూడకుండా.. జగన్ తనపై ఒడిగట్టిన దారుణాలు, కుట్రలు, అణచివేతతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ చాలా చిన్న విషయమని పేర్కొంటూ.. జగన్ హత్యాచారాలు అన్న పదం వాడారు షర్మిల.
Also Read: Chandrababu Naidu: రూ.1.24 లక్షల కోట్ల లక్ష్యం.. పన్ను ఎగవేస్తే కఠిన చర్యలు తప్పవు
Sharmila Reddy: అదేదో పొరపాటున దొర్లిన పదం కాదని ఫ్లాష్‌బ్యాక్‌కి వెళ్తే అర్థమవుతుంది. షర్మిల అసలు రాజశేఖర్‌రెడ్డికి పుట్టలేదని ప్రచారం చేశారు. అలా షర్మిల తల్లి విజయలక్ష్మినీ నిందించారు. షర్మిల తన ఇంట జరిగే శుభకార్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబును ఆహ్వానించేందుకు వెళ్లారు. అప్పుడు షర్మిల పసుపు చీర కట్టుకుందంటూ వైసీపీ నేతలు హీనమైన కామెంట్లు చేశారు. స్వయంగా జగన్‌మోహన్ రెడ్డే బహిరంగ వేదికపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక షర్మిలపై వర్రా రవీంద్రరెడ్డి లాంటి సోషల్ సైకోల చేత అత్యంత అసభ్యకరమైన పోస్టులు పెట్టించారు. ఆస్తి విషయంలో తల్లీ, చెల్లిని కోర్టుకీడ్చారు. ఇక మరో సోదరి, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతపైనా జగన్ ఎన్నో అకృత్యాలకు ఒడిగట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. అందుకే జగన్ చేసిన పాపాలను హత్యాచారాలుగా షర్మిల పోల్చి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.
షర్మిల వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ ఆరోపణలు నిజమైతే, ఇది రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక సంచలన అధ్యాయంగా నిలిచిపోనుంది. వైవీ సుబ్బారెడ్డి ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారు, విచారణ ఏ దిశగా సాగుతుందన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.