Konda surekha: తెలంగాణ సచివాలయంలోని కేబినెట్ హాల్ వద్ద గురువారం ఉదయం ఒక్కసారిగా హడావుడి వాతావరణం ఏర్పడింది. మంత్రి కొండా సురేఖకి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోవడంతో అక్కడ ఉన్నవారు కాసేపు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన కేబినెట్ సమావేశం ప్రారంభమయ్యే సమయంలోనే జరగడం గమనార్హం.
వెంటనే అక్కడికి వచ్చిన వైద్య బృందం ఆమెకు ప్రాథమిక వైద్యం అందించింది. మెడికల్ పరీక్షల అనంతరం, మంత్రి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. లో బీపీ (Low BP) కారణంగానే ఈ అస్వస్థత ఏర్పడినట్లు స్పష్టంచేశారు. తక్షణమే ఇంజెక్షన్ ఇవ్వడంతో పాటు, కొంతకాలం విశ్రాంతి అవసరమని సలహా ఇచ్చారు.
కేబినెట్ సమావేశంలో ఉన్న సమయంలో ఈ తాత్కాలిక ఆరోగ్య సమస్య తలెత్తినప్పటికీ, ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం మెరుగ్గా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. మంత్రి కొండా సురేఖకు పూర్తిస్థాయి విశ్రాంతి కల్పించేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.