Agniveer Ministers Salute: భారత్-పాకిస్థాన్ సైనిక ఘర్షణల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్ళితండాకు చెందిన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ పాక్ సైన్యంతో పోరాడి వీరమరణం పొందారు. యావత్ దేశం జవాన్ మురళీ నాయక్ మృతికి కన్నీరు పెట్టుకుంది. ఆ వీరుడికి అంతే ఘనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ముగించింది. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత.. వీర జవాన్ అంత్యక్రియలు దగ్గరుండి నిర్వహించారు. ఈ విషయంలో ఆమె ప్రత్యేక చొరవ చూపారని చెప్పొచ్చు. మురళీ నాయక్ పార్థివదేహాన్ని ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో బెంగళూరు ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు ఎయిర్‌పోర్టు వద్ద మురళీ నాయక్ పార్థివదేహంతో ప్రారంభమైన ర్యాలీ రాత్రి 9:30 గంటల వరకూ కొనసాగింది.
దారి పొడవునా జనం పెద్ద ఎత్తున తరలివచ్చి మురళీనాయక్‌కు నివాళులు అర్పించారు. యువకులు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీలు నిర్వహించారు. కర్ణాటకలో చిక్కబళ్ళాపుర, బాగేపల్లి తదితర ప్రాంతాల్లో “జై జవాన్, మురళీ నాయక్ అమర్ రహే” అన్న నినాదాలు మారుమోగాయి. శనివారం రాత్రి మురళీ నాయక్ పార్థివదేహాన్ని శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలంలోని కళ్ళితండాకు తీసుకొచ్చిన సైనికాధికారులు… అక్కడ అతని తల్లిదండ్రులు శ్రీరామనాయక్, జ్యోతిబాయిలకి అప్పగించారు. ఏపీ మంత్రి సవిత, మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్‌లు బెంగళూరు విమానాశ్రయానికే వెళ్లి.. మురళీ నాయక్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఎయిర్‌పోర్టు నుంచి రాష్ట్ర సరిహద్దు దాకా జీరో ట్రాఫిక్ రూట్ ఏర్పాటు చేసి, పార్థివదేహాన్ని ఆర్మీ వాహన కాన్వాయ్‌లో తరలించారు. మంత్రి సవిత కూడా కాన్వాయ్‌తో పాటే వచ్చారు.
వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ముగిసే వరకు మూడు రోజుల పాటు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ… సీం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ల ఆదేశాల మేరకు మురళీ నాయక్ అంత్యక్రియలు దగ్గరుండి ఎంతో ఘనంగా జరిపారు. మురళీ నాయక్ తల్లి జ్యోతిబాయి ఆవేదనను, ఆమె దుఃఖాన్ని చూసి యావత్ భారతదేశం కన్నీరు పెట్టుకుంది. ఆ తల్లి మనోవేదనను మంత్రి సవిత పంచుకోవడం, తోటి మహిళగా కొండంత భరోసా ఇవ్వడం, మంత్రి హోదాను కూడా పక్కనపెట్టి, మానవత్వంతో స్పందించి.. మురళీ నాయక్ తల్లిదండ్రులకు కొండంత ధైర్యం, భరోసా కల్పించారు.
Also Read: Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ తర్వాత కాశ్మీర్ వెళ్లిన రాజ్‌నాథ్ సింగ్
Agniveer Ministers Salute: “నేనున్నాను మీకు, స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా మీ బాధ్యత నాది” అంటూ ధైర్యం చెప్పారు. వ్యక్తిగతంగా 5 లక్షల రూపాయలు సహాయం చేశారు. వీర జవాన్ మురళీ నాయక్ చేసిన త్యాగానికి మనం ఎంత చేసినా తక్కువే అనే విధంగా జవాన్ తల్లిదండ్రులకు కొండంత భరోసా ఇచ్చారు. “మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవడం మా బాధ్యత. మా ప్రభుత్వం, మా అధినేత చంద్రబాబు మీకు అండగా ఉన్నారు. మురళీ నాయక్ భౌతికంగా మన దగ్గరగా లేకపోయినా, భారతీయుల గుండెల్లో ఎప్పటకీ సజీవంగా ఉంటారు” అంటూ ఆ తల్లిదండ్రులకు భరోసా కల్పించిన విధానం.. సవితమ్మలో మానవీయ కోణానికి అద్ధం పట్టింది.
వీరమరణం పొందిన మురళీ నాయక్‌కు యావత్ భారతదేశం సెల్యూట్ చేస్తోంది. సామాన్య ప్రజల నుంచి దేశ ప్రధాని వరకు, ప్రజాప్రతినిధులను మురళీ నాయక్ వీర మరణం కంటితడి పెట్టించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మురళీ నాయక్ కుటుంబానికి అండగా నిలవడం, మంత్రి సవిత, హోంమంత్రి వంగలపూడి అనిత జవాన్ తల్లి జ్యోతిబాయిని ఓదార్చిన తీరుపై భారీగా ప్రశంసలు వస్తున్నాయ్. సవిత, అనిత… ఇద్దరూ కూడా తమ మంత్రి హోదాను పక్కనపెట్టి, తోటి మహిళ బాధను పంచుకుని భరోసా నింపడం చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు అందర్నీ ఆకట్టుకున్నాయి. మురళీ నాయక్ అంత్యక్రియలను ఎంతో గొప్పగా నిర్వహించారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రి సవితను అందరూ ప్రశంసిస్తున్నారు.