Duplicate Court

Duplicate Court: వార్నీ అసాధ్యం కూలా! ఏకంగా నకిలీ కోర్టునే పెట్టేశాడు.. కోట్లు కొల్లగొట్టేశాడు!!

Duplicate Court: మోసాలు చేయడం.. జనాన్ని మోసాలతో ముంచెత్తడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. రకరకాల మోసాలు.. రూపాయి కడితే చాలు లక్ష ఇస్తామని కోట్లు కొట్టేసే కేటుగాళ్లు కొందరు.. ఆన్ లైన్ లో బెట్టింగ్స్.. షేర్ మార్కెట్ అంటూ జనాన్ని కోట్లలో ముంచేసే సైబర్ నేరగాళ్లు మరికొందరు. ప్రజల బలహీనతలను ఆసరాగా తీసుకుని తమ జేబులు నింపుకోవడం నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. అయితే, ఒక్కోసారి విచిత్రమైన మోసగాళ్లు తయారు అవుతారు. అసలు వారు చేసింది మోసం అని అర్ధం కావడానికి ప్రజలకు అవకాశమే ఉండని విధంగా వారు చేసే మోసం ఉంటుంది. అంతేకాదు కనీసం అధికారులకు.. పోలీసులకు.. కూడా ఒక్కోసారి ఇలాంటి మోసాల గురించి తెలియడానికి చాలా కాలం పడుతుంది. ఈలోపు జరగాల్సిన డేమేజ్ జరిగిపోతుంది. 

Duplicate Court: నకిలీ పోలీసులు.. నకిలీ ఐఏఎస్ ఆఫీసర్లు.. ఇలా నకిలీ మోసగాళ్లను ఇప్పటివరకు చాలా వినివుంటారు. కానీ, ఈ ప్రబుద్ధుడు చేసిన నకిలీ వింటే మతి పోతుంది. అవును.. గుజరాత్ లో ఒక మహానుభావుడు ఏకంగా నకిలీ కోర్టునే సృష్టించేశాడు. అంతేకాకుండా ఏకంగా నిజమైన కోర్టులోనే జరిగినట్టుగా.. తానే జడ్జిగా తీర్పులు కూడా ఇచ్చేశాడు. వందలాది ఎకరాల భూములను కొట్టేశాడు. వింటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుంటే కచ్చితంగా మీరు ఔరా! అని ముక్కున వెలుసుకుంటారు. 

Duplicate Court: గుజరాత్‌లో ఓ వ్యక్తి నకిలీ ట్రిబ్యునల్‌ను సృష్టించాడు. గాంధీనగర్‌లోని తన ఆఫీసులో  నిజమైన కోర్టు లాంటి వాతావరణాన్ని సృష్టించి, దాని న్యాయమూర్తిగా తనను తాను అభివర్ణించుకున్నాడు. తీర్పులు చెప్పేశాడు. ఈ నిందితుడి పేరు మోరిస్ శామ్యూల్. ఆర్బిట్రేటర్‌గా నకిలీ న్యాయమూర్తి మోరిస్ తన పేరిట వేలకోట్ల రూపాయల విలువైన సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి  ఉత్తర్వులు జారీ చేశాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గత ఐదేళ్లుగా ఈ నకిలీ కోర్టు నడుస్తోంది. తీరుబడిగా ఇప్పుడు విషయం తెలుసుకున్న అహ్మదాబాద్ పోలీసులు నకిలీ న్యాయమూర్తిగా నటిస్తూ ప్రజలను మోసం చేసిన మోరిస్‌ను అరెస్టు చేశారు.

Duplicate Court: మన మోరిస్ మోసం ఎలా అంటే.. తన ఆఫీసును కోర్టుగా సెట్ చేశాడు. కొంతమంది ఉద్యోగులను ఏర్పాటు చేసుకున్నాడు. వారు సిటీ సివిల్ కోర్టులో పెండింగ్ లో ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. వారి నుంచి కేసులను తాము పరిష్కరిస్తామని. తమది ప్రత్యేక కోర్టు అనీ చెప్పేవారు. మోరిస్ అధికారిక న్యాయస్థానం నియమించిన మధ్యవర్తి (ఆర్బిట్రేటర్) అని చెప్పుకునే వారు. ఇలా బాధితులను నమ్మించి.. తమ ఆఫీసుకు పిలిచేవారు. అది అచ్చం కోర్టులానే ఉంటుంది. కోర్టులో ప్రొసీడింగ్స్ జరిగినట్టుగానే.. ఇక్కడ కూడా వాయిదాలు.. వాదనలు.. జరిగేవి. తీర్పు మోరిస్ ఇచ్చేసేవారు. ఇది నిజమైన తీర్పులానే స్పష్టంగా ఉంటుంది. ఈ మొత్తం సీన్ కోసం పిటిషనర్ల దగ్గర బాగానే డబ్బులు వసూలు చేశేవారు. కోర్టులో తీర్పు త్వరగా రావాలనే ఆశతో పిటిషనర్లు వారు చెప్పినంత సమర్పించుకుని.. మోరిస్ ఇచ్చే మోస్ట్ స్పీడ్ తీర్పు నిజంగా కోర్టు ఇచ్చిన తీర్పే అనుకుని వెళ్ళిపోయేవారు. ఎక్కడ కూడా ఎవరికీ అనుమానం రాని విధంగా నిజం కోర్టులానే.. ఇంకా మనం చెప్పుకోవాలంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో హాస్పిటల్ వ్యవహారంలానే ఈ నకిలీ కోర్టు ఐదేళ్ల పాటు నిరాఘాటంగా సాగింది. 

ALSO READ  Hyderabad: బైక్ దొంగల ముఠా అరెస్ట్

దొరికాడు ఇలా.. 

Duplicate Court: మన మోరిస్ బాబు 2019లో ఒక కేసులో పైన చెప్పిన తతంగం అంతా నడిపించి తనదైన స్టైల్ లో తీర్పు ఇచ్చేశాడు. ఆ కేసు కలెక్టర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసు అది. పాల్దీ ప్రాంతంలోని ప్రభుత్వ భూమి తనది అని క్లైయిమ్ చేసిన ఒక వ్యక్తికీ దానిని కట్టబెట్టేశాడు తన తీర్పుతో. ఆ తీర్పు పత్రాలతో రియల్ కోర్టు రిజిస్ట్రార్ కూడా మోసపోయారు. అది నిజమైన తీర్పుగా భావించి సదరు భూమి పత్రాలలో తన క్లయింట్ పేరు యాడ్ చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు కూడా ఇచ్చేశారు. ఆ తరువాత ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఇదే మోరిస్ మరో లాయర్ ద్వారా సివిల్ కోర్టులో కేసు వేశాడు. దానికి మోరిస్ ఇచ్చిన కోర్టు తీర్పు కాపీ జత చేశారు. ఒకసారి అంటే రిజిస్ట్రార్ మోసపోయారు. కానీ, ఈసారి మాత్రం సివిల్ కోర్టు రిజిస్ట్రార్ హార్దిక్ దేశాయ్ దీనిని పట్టుకున్నారు. అసలు మోరిస్ మధ్యవర్తి కాదని గుర్చించారు. దీంతో వెంటనే కరంజ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నకిలీ కోర్టు వ్యవహారాన్ని తమదైన శైలిలో దర్యాప్తు చేసి.. మోరిస్ ను కటకటాల్లోకి పంపించారు. 

ఇది గుర్తుందా?

గుజరాత్ లో కొంత కాలం క్రితం ఏకంగా ఒక నకిలీ టోల్ గేట్ ఏర్పాటు చేసి ఒక ఘనుడు కోట్ల రూపాయలు కొన్నేళ్ల పాటు వాహనదారుల నుంచి లాగేశాడు. అలాగే.. 2023లో కిరణ్ పటేల్ అనే వ్యక్తి ప్రధానమంత్రి కార్యాలయం అధికారిగా చెప్పుకుని ఏకంగా మంత్రి బంగ్లాకు ఎసరు పెట్టే ప్రయత్నం చేశారు. ఇలాంటి నయా మోసాలు వెలుగులోకి వచ్చినపుడల్లా ఆశ్చర్యపోవడం జనాల వంతవుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే నకిలీల దెబ్బకు ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *