Waqf Bill : వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో నిరసనలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, గుజరాత్, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, అస్సాంలలో శుక్రవారం ప్రార్థనల తర్వాత ముస్లింలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఈ నిరసనల్లో మహిళలు, పిల్లలు కూడా పాల్గొన్నారు.
ఇక ఉత్తరప్రదేశ్‌లోని 75 జిల్లాల్లోనూ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. పోలీసుల ఫ్లాగ్ మార్చ్ కొనసాగుతోంది. లక్నోలోని దర్గాలు, మసీదులను డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు యుపి మైనారిటీ కమిషన్ మాజీ చైర్మన్ అష్ఫాక్ సైఫీకి హత్య బెదిరింపులు వచ్చాయి. అతని బావమరిదిని కొందరు వ్యక్తులు చితకబడినట్టు చెబుతున్నారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ముస్లిం సమాజానికి చెందిన వందలాది మంది వీధుల్లో గుమిగూడారు. పోస్టర్లు, బ్యానర్లపై – వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోండి, యుసిసిని తిరస్కరించండి అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. నల్లని బ్యాండ్లను చేతికి ధరించిన వారంతా “నియంతృత్వం పనిచేయదు” అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు 50 మందిని అరెస్టు చేశారు.
Also Read: Karnataka: పోలీసోడి కక్కుర్తి.. అనాధలకు సహాయం చేసేవాడి దగ్గర పర్స్ కొట్టేసిన ఎస్సై!
Waqf Bill : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని పార్క్ సర్కస్ క్రాసింగ్ వద్ద వేలాది మంది వీధుల్లో గుమిగూడారు. ఇక్కడ కూడా, వక్ఫ్ బిల్లును తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ బ్యానర్లు, పోస్టర్లు పట్టుకుని ప్రజలు నిరసన తెలుపుతున్నారు. కోల్‌కతాలో చాలా చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. వక్ఫ్ బిల్లుకు నిరసనగా ప్రజలు ప్లకార్డులు తగలబెట్టారు.
రాంచీలో కూడా గందరగోళం నెలకొంది. వక్ఫ్ బిల్లు దేశానికి సరైనది కాదని, ముస్లింలకు సరైనది కాదని ఆందోళనలో పాల్గొన్న వారు నినాదాలు చేశారు. బీహార్‌లో కూడా ప్రజలు బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. తమిళనాడులో, నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం కార్యకర్తలు బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.