RamaNaidu Studios: విశాఖలోని రామానాయుడు స్టూడియో భూముల వివాదం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయాం ఐదేళ్లలో విశాఖలో వైసీపీ నేతల ఆగడాలలో ఒకటిగా చెప్తారు ఈ వివాదాన్ని. విశాఖపట్నం నుంచి భీమిలీ వైపుగా ఉన్న రామానాయుడు స్టూడియోకు గతంలో టీడీపీ ప్రభుత్వం సుమారు 35 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే అందులో స్టూడియో అభివృద్ధికి పోగా మిగిలి ఉన్న 15 ఎకరాల భూమిపై గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు కన్నేశారు.
లే అవుట్లు వేసి ఆ భూమిని అమ్మే ప్రయత్నాలు కూడా జరిగాయన్న ఆరోపణలున్నాయి. దీన్ని అడ్డుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వైసీపీ హయాంలో అనేక పోరాటాలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని స్టూడియో అభివృద్ధికి కాకుండా ఇతర కార్యక్రమాలకు వాడుకుంటున్నారనీ, భూములు అమ్మి సొమ్ము చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ అప్పట్లోనే కోర్టును ఆశ్రయించారు వెలగపూడి రామకృష్ణ బాబు. దీంతో నాడు వైసీపీ నేతల ప్రయత్నాలకు అడ్డుకట్ట పడ్డట్లైంది.
2000 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రామానాయుడు స్టూడియో కోసం ఈ భూమిని కేటాయించడం జరిగింది. దాదాపుగా 20 ఎకరాల వరకు స్టూడియో నిర్మాణానికి ఉపయోగించగా, మిగిలిన 15.17 ఎకరాల భూమిపై వివాదాలు కొనసాగుతున్నాయి. వైసీపీ హయాంలో లే అవుట్లకు అనుమతులు తీసుకునే ప్రయత్నాలు జరిగినట్టు ప్రచారం జరిగింది. కేవీ రావు మెడపై కత్తిపెట్టి కాకినాడ పోర్టును లాక్కున్నట్లే.. రామానాయుడు స్టూడియో భూముల విషయంలోనూ బెదిరింపుల పర్వం నడిచిందని అనేక సందర్భాల్లో వార్తలొచ్చాయి. అప్పట్లో టీడీపీ నేతలు దీనిపై బలంగా నిలబడటంతో వైసీపీ నేతల ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి.
Also Read: Bandi sanjay: చెన్నైలో మాఫియా ముఠా..
RamaNaidu Studios: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రస్తుతం మళ్లీ ఈ భూమిపై చర్చ మొదలైంది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్వయంగా అసెంబ్లీలోనే ఈ అంశాన్ని లేవనెత్తారు. నిరుపయోగంగా ఉన్న సదరు 15 ఎకరాల స్టూడియో భూములు అన్యాక్రాంతం కాకముందే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరి ఎమ్మెల్యే వెలగపూడి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా, లేదా స్టూడియో యాక్టివిటీలను ప్రోత్సహించాలని నిర్ణయిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
ఒకసారి ప్రభుత్వం భూమి కేటాయించిన తర్వాత తిరిగి స్వాధీనం చేసుకోవడం అనేది సాధారణంగా జరగదు. ఇక సినీ పరిశ్రమను విశాఖలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్లాలనుకుంటే, ఈ భూమిని ఎలా వినియోగించాలన్న దానిపై స్పష్టత అవసరం. ప్రస్తుతం ఏపీలో ఉన్న ఏకైక ప్రముఖ స్టూడియో రామానాయుడు స్టూడియోనే. దీనికి సంబంధించి తరచుగా వివాదాలు వస్తుండటంతో, భవిష్యత్తులో సినీ పరిశ్రమ విశాఖకు వస్తుందా లేదా అన్నదీ సందేహంగా మారింది. ప్రభుత్వం పరిశ్రమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందా లేక భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.