Virat Kohli: టెస్టు క్రికెట్ లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు.బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అవమానకర ప్రదర్శన చేసిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకుంది. తొలి టెస్టు మూడో రోజు రెండో ఇన్నింగ్స్ లో భారత ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీలు సాధించారు.
ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 9 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. సచిన్(15,921), రాహుల్ ద్రవిడ్(13, 265), సునీల్ గావస్కర్(10, 122) ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 197 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఈ మైలు రాయిని చేరుకున్నాడు. మొత్తంగా ఈ ఘనత సాధించిన18వ ప్లేయర్‌గా విరాట్ నిలిచాడు.
కాగా, భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. సచిన్ 200 టెస్టుల్లో 329 ఇన్నింగ్స్‌ల్లో 15921 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 68 అర్ధ సెంచరీలు, 51 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ రెండో స్థానంలో ఉన్నాడు. ద్రవిడ్ 163 టెస్టుల్లో 284 ఇన్నింగ్స్‌ల్లో 13265 పరుగులు చేశాడు. 125 టెస్టుల్లో 214 ఇన్నింగ్స్‌లలో 10122 పరుగులు చేసిన సునీల్ గవాస్కర్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన విరాట్.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని దూకుడు ప్రదర్శించాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లోనూ అంతగా ఆకట్టుకోలేదు. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న విరాట్‌కు ఈ ఇన్నింగ్స్ ఊరటనిచ్చింది.