Telangana:నేటి నుంచి 19 వ‌ర‌కు న‌ల్ల‌గొండ ల‌తీఫ్‌షా షా ఖాద్రి ఉర్సు.. రేపే గంధం ఊరేగింపు

Telangana:తెలంగాణ‌లోని న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రంలో బుధ‌వారం సాయంత్రం నుంచి మొద‌లై ఈ నెల 19 వ‌ర‌కు స‌య్య‌ద్ ల‌తీప్ ఉల్లాషా ఖాద్రి ఉర్సు జ‌ర‌గ‌నున్న‌ది. ప‌ట్ట‌ణంలోని ల‌తీఫ్‌షా గుట్ట‌పై ఉన్న సుమారు వెయ్యేండ్ల చ‌రిత్ర క‌లిగిన‌ ద‌ర్గాలో జ‌రిగే ఈ ఉర్సుకు న‌ల్ల‌గొండ జిల్లా నుంచే కాకుండా సూర్యాపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి, హైద‌రాబాద్, ఉమ్మ‌డి రంగారెడ్డి త‌దిత‌ర తెలంగాణ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తారు. ఏపీ, క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర‌కు చెందిన వారు కూడా పెద్ద సంఖ్య‌లో వ‌చ్చి ఈ ఉత్స‌వాల్లో పాల్గొంటారు. హిందూ, ముస్లింల మ‌త‌సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌గా నిలిస్తున్న ఈ ద‌ర్గా వ‌ద్ద ప్ర‌తి శుక్ర‌, ఆదివారాల్లో పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు కందూరు నిర్వ‌హిస్తారు.

Telangana:ఏటా వారంరోజుల పాటు ల‌తీఫ్‌షా ద‌ర్గా కింద మెట్ల వ‌ద్ద ఉర్సు జ‌రుగుతుంది. బెంగ‌ళూరుకు చెందిన క‌వ్వాళి బృందం ఉర్సు జ‌రిగిన‌న్ని రోజులు ప్ర‌త్యేకంగా సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తుంది. ఉర్సు తొలిరోజున హైద‌రాబాద్ రోడ్డులో ఉన్న మ‌దీనా మ‌సీదు నుంచి గంధాన్ని ఊరేగింపుగా ల‌తీఫ్‌షా గుట్ట‌పై ఉన్న ద‌ర్గా వ‌ద్ద‌కు జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎస్పీ తీసుకెళ్తారు. 60 ఏండ్లుగా ల‌తీఫ్‌షా ద‌ర్గా చైర్మ‌న్లుగా హిందూ క‌మ్యూనిటీకి చెందిన వ్య‌క్తులే ఉంటుండ‌టం మ‌రో విశేషం.

Telangana:ఇరాక్ దేశ‌పు రాజ‌ధాని అయిన బాగ్దాద్ న‌గ‌రానికి చెందిన ల‌తీఫుల్లా ఖాద్రీ అనే మ‌త గురువు త‌మ మ‌త ప్ర‌చారం చేసేందుకు, ప్ర‌జ‌ల‌కు మంచి బోధ‌న‌లు చేసేందుకు క్రీ.శ‌. 960 నుంచి 1050 సంవ‌త్స‌రాల మ‌ధ్య కాలంలో న‌ల్ల‌గొండ జిల్లాలోని దేవ‌ర‌కొండ ప్రాంతానికి వ‌చ్చాడు. కొంత‌కాలం త‌ర్వాత న‌ల్ల‌గొండ ప‌ట్ట‌ణానికి వ‌చ్చి అక్క‌డి గుట్ట‌పైన నివాసం ఏర్పాటు చేసుకొన్నాడు. అలా అక్క‌డ అత‌ను అనేక ఏండ్లు ఉండ‌టం వ‌ల్ల ఆ గుట్ట‌కు ల‌తీఫ్‌షా గుట్ట అని పేరొచ్చింది. ఆయ‌న బోధ‌న‌లు విన‌డానికి భ‌క్తులు 500 మెట్ల‌ను సుల‌భంగా ఎక్కి గుట్ట‌పైకి వ‌చ్చేవారు. అలా మ‌త బోధ‌న‌లు చేస్తూ కొంత‌కాలం గ‌డిచిన త‌ర్వాత ల‌తీఫ్‌షా, అత‌ని అన్న కుమారులైన ఎస్‌కే అల్లావుద్దీన్‌, ఎస్కే ఫ‌రీద్‌లు గుట్ట‌పైనే స‌మాధి అయ్యార‌ని భ‌క్తుల న‌మ్మ‌కం.

Telangana:ఈ ఏడాది ల‌తీఫ్‌షా గుట్టపై ఉర్సు ఉత్స‌వాల కోసం ప్ర‌త్యేక‌ ఏర్పాట్లు చేయాల‌ని న‌ల్ల‌గొండ జిల్లా కలెక్ట‌ర్ సీ నారాయ‌ణ‌రెడ్డి, జిల్లా ఎస్పీ శ‌ర‌త్ చంద్ర‌ప‌వార్ ఆదేశాలు జారీ చేశారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన తాగునీరు, శానిటేష‌న్ వంటి సౌక‌ర్యాల‌ను క‌ల్పించాల‌ని సూచించారు. బుధ‌వారం సాయంత్రం ఉర్సు ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని, 17న గంధం ఊరేగింపు ఉంటుంద‌ని వారు చెప్పారు. ఈ ఉత్స‌వాల సంద‌ర్భంగా ఎలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా శాంతియుతంగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీస్ అధికారుల‌ను కోరారు. ఏర్పాట్ల‌ను ఆర్డీవోలు, డీఎస్పీలు పర్య‌వేక్షించాల‌ని ఆదేశించారు. పార్కింగ్, క్యూలైన్లు, బారికేడ్ల ఏర్పాట్ల‌లో జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని, రాత్రివేళల్లో బందోబ‌స్తు ఉటుంద‌ని, ట్రాఫిక్ నియంత్ర‌ణకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. అంత‌టా సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *