Telangana News: సుప్రీంకోర్టులో మంగళవారం విచారణకు రానున్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ మార్చి 4వ తేదీకి వాయిదా పడింది. ఇప్పటికే విచారణపై వాదోపవాదాలు జరిగాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు ఇంకా ఎంత గడువు కావాలంటూ గత విచారణ సమయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ రోజు (ఫిబ్రవరి 25) ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాశంగా మారింది. దీనిని ఇప్పుడు వాయిదా వేశారు.
Telangana News: బీఆర్ఎస్ పార్టీలో గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత కొన్నాళ్లకు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై హైకోర్టులో విచారణ జరగగా, జాప్యం కొనసాగుతుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Telangana News: ఈ మేరకు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణను జస్టిస్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం స్వీకరించనున్నది. దీనిపై తుది తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్టు జోరుగా చర్చ జరుగుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తీర్పు వస్తే ఆ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయంగా కనిపిస్తుంది. తీర్పు మరోలా వస్తే ఇంకొంత కాలం జాప్యం జరిగే అవకాశం ఉన్నది. ఈ దశలో ఇవ్వాళ్లి విచారణకు స్పీకర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి గైర్హాజరయ్యారు. ఆయన వినతి మేరకు కేసు విచారణను మార్చి 4కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వీరే
1) దానం నాగేందర్
2) కడియం శ్రీహరి
3) తెల్లం వెంకట్రావు
4) పోచారం శ్రీనివాస్‌రెడ్డి
5) బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
6) కాలే యాదయ్య
7) టీ ప్రకాశ్‌గౌడ్
8) అరికెపూడి గాంధీ
9) గూడెం మహిపాల్‌రెడ్డి
10) ఎం సంజయ్‌కుమార్