Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు హాజరైన ఓ కార్యక్రమంలో సమోసాలు మిస్ అవడంతో, ఈ అంశం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సీఐడీ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సీఎం కోసం వడ్డించాల్సిన సమోసాలు కనిపించకుండా పోయాయి. దీనిపై ఆఫీసులోని అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
సామాన్యంగా సీఐడీ అనేది అవినీతి, భారీ కుంభకోణాలు, క్రిమినల్ కేసుల విచారణ చేపట్టే సంస్థ. కానీ ఈసారి, అదృశ్యమైన సమోసాల కేసును పరిశోధించేందుకు రంగంలోకి దిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ దర్యాప్తుకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలిచ్చిందనే వార్తలు తెరపైకి రావడంతో, విమర్శలు ఊపందుకున్నాయి.
ఈ విషయం బయటకు రావడంతో ప్రతిపక్షాలు, ప్రజలు తీవ్రంగా స్పందించారు. “రాష్ట్రంలో డ్రగ్స్ సమస్య, హత్యలు, ఇతర ముఖ్యమైన నేరాలు ఉన్నప్పుడు, సమోసాల వెనుక పడటం ఏమిటి?” అంటూ సీఐడీ తీరును ఎద్దేవా చేశారు. మరోవైపు, ఈ అంశం బయటకు ఎలా పొక్కిందో తెలుసుకోవడానికి సీఐడీ అంతర్గత దర్యాప్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా, సమాచారాన్ని లీక్ చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్(FIR) నమోదు చేసింది.
Also Read: Viswambhara: మెగాస్టార్ విశ్వంభరకి బాలీవుడ్ లో భారీ రేటు!
అయితే, ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం ఈ విచారణకు తమ దగ్గర నుంచి ఎలాంటి ఆదేశాలు వెళ్లలేదని స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ, ఈ ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. “సీఎం సమోసాలు మిస్ కావడం ఏంటి?” అంటూ జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు.
ఈ సంఘటన అనంతరం, అధికార యంత్రాంగం పై ప్రయోజనకరమైన కేసులకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ, ప్రజలు, రాజకీయ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.