Padi kaushik reddy: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశారు. ట్విట్టర్ వేదికగా, “నిరుపేదలకోసం గొప్ప అవకాశం! ఇండ్లు లేని నిరుపేదలు ‘ఇందిరమ్మ రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ (IRIS)’ ద్వారా మీ కలలను సాకారం చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసిన వెంటనే, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కలవండి” అంటూ పోస్ట్ చేశారు.
వీడియోలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు హైదరాబాద్ నడిబొడ్డున నిర్మిస్తున్న అద్భుతమైన ఇండ్లను చూడండి. ఈ ప్రాజెక్టు పేరు ‘ఇందిరమ్మ రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ (IRIS)’. మీకు ఇందిరమ్మ మీద ఉన్న ప్రేమను ఈ ప్రాజెక్టు ద్వారా చూపిస్తున్నారు. మీరు ఈ అద్భుతమైన ఇండ్లను హైదరాబాద్‌లో పేదల కోసం నిర్మించారు. దయచేసి మా హుజురాబాద్ కూడా ఇలాంటి ఇండ్లు కట్టి పేదల కలలు సాకారం చేయండి” అంటూ అభ్యర్థించారు.
పాడి కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్యలతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పరోక్షంగా ఎగతాళి చేస్తూ, పేదలపట్ల ఆయన కట్టుబాటును ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.