Senior Citizens Love Story: ప్రేమకు వయసు అడ్డం కాదు. అది ఏ వయసులోనైనా పుట్టొచ్చు. ప్రేమ అనగానే అదేదో అని ఊహించుకొనవసరం లేదు. జీవిత చరమాంకంలో కూడా ఒకరికి ఒకరు తోడుగా ఉండాలనే ఆశ పట్టవచ్చు. ఆ ప్రేమ పెళ్ళికి దారి తీయవచ్చు. అప్పుడప్పుడు ఇలా పెద్ద వయసు వ్యక్తులు పెళ్లి చేసుకున్న సంఘటనలు వింటూనే ఉంటాం. కానీ, ఈ ప్రేమ కథ కాస్త ఇంట్రస్టింగ్. ఇందులో 71 ఏళ్ల తాత గారిది ఒకరకమైన ప్రేమ విషాదం అయితే.. 65 ఏళ్ల బామ్మ గారిది మరో రకమైన కుటుంబ బాధ్యతల కోసం చేసిన త్యాగభరిత కథ. వీరిద్దరిని అసోం లోని ఒక వృద్ధాశ్రమం కలిపింది. వీరిద్దరి ప్రేమ-పెళ్లి కథ ఏమిటో తెలుసుకుందాం.
బ్రేకప్ స్టోరీ
అస్సాంలోని కోలగట్ జిల్లా పోకగట్‌కు చెందిన పద్మేశ్వర్ గోలా (71) అనే వ్యక్తి యవ్వనంలో ఉండగా ఒక యువతిని ప్రేమించాడు. అయితే, ఆ యువతి ఇతనిని ప్రేమించినట్లు చెప్పి తరువాత తన దారి తాను చూసుకుని వేరే పెళ్లి చేసుకుంది. దీంతో భగ్న ప్రేమికుడైన పద్మేశ్వర్ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయాడు. వయసు పెరిగిపోయింది. తనను చూసే వాళ్ళు ఎవరు లేరు. ఇక తన చివరి రోజులను వృద్ధాశ్రమంలో గడపాలని రెండేళ్ల క్రితం గౌహతిలోని బెల్టోలా ప్రాంతంలో నిర్వహిస్తున్న ప్రమోద్ తాలుక్దార్ మెమోరియల్ హోమ్‌లో చేరిపోయాడు. అక్కడ జీవితం గడిపేస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Mobile Phone Walking: అయ్యో ఫోన్ ముచ్చట్లేనా.. చూసుకునే పనిలేదా.. చేతిలో పసిపాపతో డ్రైనేజిలో పడిన మహిళ
బాధ్యతల అంతులేని కథ
ఇక అదే రాష్ట్రం సోనిత్‌పూర్ జిల్లా తేజ్‌పూర్‌కు చెందిన జయప్రభ బోరా (65) ది అంతులేని కథ సినిమా టైప్ స్టోరీ. తన ఇద్దరి అన్నదమ్ముల బాధ్యతలను చిన్నతనం నుంచే మోయాల్సి వచ్చింది. దీంతో వారిని చదివించి.. ప్రయోజకులను చేసి.. వారిని స్థిరపరిచే క్రమంలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది. ఇటీవల ఇద్దరు అన్నదమ్ములు మరణించారు. దీంతో ఈమె గత జనవరిలో జనవరిలో ప్రమోద్ తాలూక్దార్ మెమోరియల్ హోమ్‌లో ఆశ్రయం పొందారు.
పాట కలిపిన బంధం..
వీరిద్దరూ హోమ్ లోనే ఉంటున్నా ఎప్పుడూ ఒకరితో ఒకరు పెద్దగా మాట్లాడుకున్నది లేదు. అయితే, గత మార్చి నెలలో హోమ్ లో జరిగిన ఒక వేడుకలో జరిగిన కార్యక్రమాలలో పద్మేశ్వర్ హిందీ పాటలు పాడాడు. అవి విన్న జయప్రభ ఆ పాటలకు ఫిదా అయిపొయింది. దీంతో పాటు పాటలు పాడిన పద్మేశ్వర్ గొంతుకు ఫ్యాన్ అయిపోయింది. ఆ తరువాత తరుచు పద్మేశ్వర్ పాటలు పాడడం.. జయప్రభ సరదా పడడం ఇలా వారి మధ్య స్నేహం పెరిగి పెద్దదైంది. ఇద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో పడిపోయారు. లేటు వయసులో ఘాటు ప్రేమ రుచి చూసిన ఇద్దరూ చివరకు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు.
తమ నిర్ణయాన్ని హోమ్ నిర్వాహకులకు తమ కోరికను తెలిపారు. జీవిత చరమాంకంలో ఒకరికి ఒకరు తోడుగా నిలవాలని ఆ జంట తీసుకున్న నిర్ణయానికి హోమ్ నిర్వాహకులు కూడా ఎస్ చెప్పడంతో పాటు తామే, వారిద్దరి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. గౌహతిలోని మడ్‌గారియాలో మహిళల కోసం ఉన్న వృద్ధాశ్రమంలో వీరి పెళ్లిని ఘనంగా నిర్వహించారు. ఆ వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘మోనాలిసా సొసైటీ’ వివాహ ఏర్పాట్లను చూసుకుంది.
పద్మేశ్వర్, జయప్రభల వివాహం ఇటీవల అస్సాం సంప్రదాయ పద్ధతిలో అలంకరించిన వేదికపై అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో వృద్ధాశ్రమ వాసులే కాకుండా గౌహతి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 1000 మందికి పైగా పాల్గొన్నారు. ఒక్కటైన ఈ ప్రేమ జంటకు అభినందనలు తెలిపి రుచికరమైన విందు భోజనం చేసి వెళ్లారు అందరూ.