Prashant Varma: కొన్ని సంఘటనలను కళ్ళతో చూస్తే కానీ నమ్మబుద్ధి కావు. కానీ కొన్ని సంఘటనలు ఊహాతీతంగా జరిగిపోతుంటాయి. ‘హను-మాన్’ మూవీ తీసిన తర్వాత ప్రశాంత్ వర్మ ఆఫీస్ కు ఓ కోతి వచ్చి వెళుతూ ఉండేది. అక్కడ వున్న జెండా కర్రను పట్టుకుని ఊగేది. అలానే ‘జై హనుమాన్’ మూవీ స్క్రిప్ట్ పూజ చేసినప్పుడూ ఇలాంటి సంఘటనే జరిగింది. విశేషం ఏమంటే… ఇటీవల ‘దేవిక నందన వాసుదేవ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ కొన్ని కార్డ్స్ చూపించి, అందులో ఒకటి పిక్ చేయమన్నప్పుడు ప్రశాంత్ వర్మ చూడకుండా ఎంచుకున్న కార్డ్ లో హనుమంతుడే ఉన్నారు. ఇది అక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వెంటనే సుమ ‘మీరు హనుమంతుడిని ఛూజ్ చేసుకోవడం కాదు.. ఆయనే మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారు’ అని చెప్పడంతో అందరూ హర్షధ్వానాలు చేశారు. నిజంగానే ఏ ముహూర్తాన ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’ను మొదలెట్టారో కానీ అది ఓ యూనివర్శ్ గా విస్తరించుతోంది.
