Congress: పటాన్‌చెరు ఎమ్మెల్యే, ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గూడెం మహిపాల్‌రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకే చెందిన ఆ నియోజకవర్గ నేత కాటా శ్రీనివాస్‌గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో తాను పార్టీ బాధ్యుడిగా ఉండగా, నీలం మధును తనకు పోటీగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని కాటా శ్రీనివాస్‌గౌడ్ తీవ్ర అసంతృప్తితో ఉండగా, ఏకంగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డినే తీసుకొచ్చి ఆ ఇద్దరికీ ఎదురుగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది.
Congress: ఈ దశలో కాటా శ్రీనివాస్‌గౌడ్.. ఇటు నీలం మధు, అటు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గతంలో జరిగిన 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన కాటా శ్రీనివాస్‌గౌడ్.. అనంతరం పార్టీ క్యాడర్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ దశలో తనకు ప్రాధాన్యం లేకుండా పోతుందని ఆయన భావిస్తున్నారు.
Congress: ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి వచ్చిన తొలినాళ్లలోనే పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లిన కాటా శ్రీనివాస్‌గౌడ్ ఏకంగా గాంధీభవన్‌లో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కొంత సద్దుమణిగినా తాజాగా నియామకాలు మళ్లీ వారి మధ్య చిచ్చు పెట్టాయి. ఎమ్మెల్యే తన అనుచరులకే ప్రాధాన్యమిస్తూ మార్కెట్, ఇతర కమిటీల్లో నియామకాలు చేపడుతున్నారని, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు తీరని అన్యాయం జరుగుతుందని కాటా శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Congress: ఈ దశలో ఏకంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిపై కాటా శ్రీనివాస్‌గౌడ్ తీవ్ర దూషణలకు దిగడం కలకలం రేపింది. ఒకే పార్టీకి చెందిన నేతలు దూషణలతో నియోజకవర్గ కాంగ్రెస్‌లో అయోమయం నెలకొన్నది. గూడెం మహిపాల్‌రెడ్డి ఒక దొంగ.. అని కాటా శ్రీనివాస్‌గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ దొంగను జైల్లో పెట్టింది మనమే.. ఈ రోజు పార్టీలో చేర్చుకొని ఆ దొంగకే పెత్తనం ఇచ్చింది మనమే.. కాంగ్రెస్‌పార్టీలో కష్టపడి పనిచేసిన వారిపై కేసులు పెట్టిన ఆ దొంగ మహిపాల్‌రెడ్డికి పెత్తనం ఇవ్వడం బాధగా ఉన్నది.. అని కాటా శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు.
Congress: కాటా శ్రీనివాస్‌గౌడ్ ఆరోపణలపై ఇటు సీఎం రేవంత్‌రెడ్డి, అటు పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదో వేచి చూడాలి మరి. వారిద్దరి మధ్య సయోధ్య కుదుర్చుతుందా? లేక కాటా శ్రీనివాస్‌గౌడ్ కోరుకుంటున్న పార్టీ కార్యకర్తలకు పదవులను కట్టబెట్టి ఆయన ఆగ్రహాన్ని చల్లారుస్తుందా? అన్నది తేలాల్సి ఉన్నది.