Telangana: ప్రాథమిక విద్యా వ్యవస్థకు తెలంగాణ ప్రభుత్వం కొత్త ఊపిరి పోస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 157 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలలు లేని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
20 మంది విద్యార్థులు ఉంటేనే స్కూలు:
పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రభుత్వ పాఠశాలలు లేని నివాస ప్రాంతాలలో, కనీసం 20 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట కొత్త పాఠశాలలను నెలకొల్పనున్నారు. ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ప్రాథమిక విద్యను మరింత చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమతుల్య ఏర్పాటు:
ఈ 157 పాఠశాలల్లో 63 పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా, మిగిలిన 94 పాఠశాలలు పట్టణ/నగర ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం 212 గ్రామీణ ఆవాసాలు, 359 పట్టణ కాలనీలు/వార్డుల్లో మొత్తం 571 పాఠశాలలను నెలకొల్పుతామని ప్రకటించిన నేపథ్యంలో, ఇది మొదటి విడతగా భావిస్తున్నారు.
Also Read: Telangana News: జూబ్లీహిల్స్ సహా తెలంగాణలో మరో అసెంబ్లీ ఉప ఎన్నిక తప్పదా?
మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత:
కొత్తగా ఏర్పాటు కానున్న ఈ పాఠశాలలకు అవసరమైన ఫర్నిచర్, విద్యా సామగ్రి ఇతర మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్‌ను పాఠశాల విద్యాశాఖ సమకూర్చనుంది. ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా ఈ నిధులను పాఠశాలలకు చేరవేస్తారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఈ నిర్ణయంతో, ప్రాథమిక విద్యను బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడానికి కూడా దోహదపడుతుందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.