Telangana News:తెలంగాణలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. నువ్వా? నేనా? అన్ని రీతిలో ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ అస్త్రశస్త్రాలను సంధించుకుంటున్న వేళ మరో ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నిక రానున్నదా? అంటే పరిణామాలు అటువైపే దారి తీస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్‌తోపాటు గోషామహల్ నియోజకవర్గాల్లో ఒకేసారి ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదు.
Telangana News:తరచూ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తంచేస్తూ వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏకంగా రాజీనామా చేసేశారు. ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక విషయంలో కేంద్రం నాయకత్వంపై నిరసన గళం విప్పిన ఆయన ఏకంగా పార్టీకి రాజీనామా ప్రకటించారు. ఆ పార్టీ తాజా మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఆ లేఖను అందజేశారు. అదే లేఖ ఆధారంగా స్పీకర్‌కు తన ఎమ్మెల్యే పదవికి అనర్హత వేటు వేయించి రద్దు చేయించాలని కూడా ఆయన కోరారు. తాను ఇక బీజేపీ సభ్యుడును కానని ప్రకటించారు.
Telangana News:ఇదే అదనుగా భావించిన బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు కూడా రాజాసింగ్ పట్ల కఠినంగానే ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. రాజాసింగ్‌ను బీజేపీ నుంచి బయటకు పంపేందుకే పలువురు నేతలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. పలుమార్లు పార్టీని, పార్టీ కీలక నేతలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిన ఆయనను వదిలించుకోవడానికి ఇదే సరైన సమయమని కూడా వారు భావిస్తున్నట్టు సమాచారం. ఇంకెంతకాలం ఆయనను భరించాలని పార్టీ కేంద్ర నాయకత్వం వద్ద వారు ఫిర్యాదులు కూడా చేసినట్టు తెలిసింది.
Telangana News:ఈ దశలో రాజాసింగ్ వైఖరిపై రాష్ట్ర ముఖ్య నేతలు కేంద్ర అధిష్టానానికి ఓ లేఖను పంపినట్టు తెలుస్తున్నది. ఆ లేఖపై రాష్ట్రంలోని కీలక నేతలు సంతకాలు కూడా చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ లేఖను కనుక ఆమోదిస్తే రాజాసింగ్‌పై అనర్హత వేటు వేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పీకర్‌ను కోరే అవకాశం ఉన్నది. దీంతో రాజాసింగ్‌పై అనర్హత వేటు పడనున్నది.
Telangana News:ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ తన పదవిని కోల్పోతే.. గోషామహల్‌లో ఖాళీ ఏర్పడితే.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు గోషామహల్ స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఏర్పడుంతుంది. దీంతో సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ, తనకున్న పట్టుతో గెలుపొందాలని బీఆర్ఎస్, అధికారంలో ఉన్న కారణంగా గోషామహల్ స్థానాన్ని కొట్టేయాలని కాంగ్రెస్ కాచుకొని ఉంటాయి. ఇదే స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థిగా, లేదా శివసేన పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగానైనా బరిలోకి దిగేందుకు రాజాసింగ్ మొగ్గు చూపొచ్చని ఆయన అనుచర వర్గం తేల్చి చెప్తున్నది. మరి రాజకీయ పరిణామాలు ఎటు వైపునకు దారితీస్తాయె కొద్దిరోజుల్లోనే తేలనున్నది.