Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం: రేబిస్ వ్యాధి పట్ల నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో మరోసారి రుజువైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ళ బయ్యారంలో ఓ యువకుడు పెంపుడు కుక్క గోరు గీరడంతో రేబిస్ సోకి మరణించాడు. రెండు నెలల క్రితం జరిగిన చిన్న ఘటన ప్రాణం తీయడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
పూర్తి వివరాలు:
ఏడూళ్ళ బయ్యారం గ్రామానికి చెందిన 25 ఏళ్ల సందీప్ అనే యువకుడు రెండు నెలల క్రితం వీధిలో దొరికిన ఓ కుక్కపిల్లను ఇంటికి తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. ఆ కుక్కపిల్ల అతని తండ్రిని కరిచి, సందీప్‌ను గోళ్లతో గీరింది. కుక్క కరిచినందున సందీప్ తన తండ్రిని స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. అయితే, తనను కేవలం గోళ్లతో గీరింది కదా, ఏమీ కాదులే అని భావించి సందీప్ నిర్లక్ష్యం చేశాడు.
రేబిస్ లక్షణాలు, విషాదకర మరణం:
వారం రోజుల క్రితం సందీప్‌లో రేబిస్ వ్యాధి లక్షణాలు కనిపించాయి. తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సందీప్‌కు రేబిస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. అప్పటికే వ్యాధి ముదిరిపోవడంతో చికిత్సకు స్పందించలేదు. గత వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సందీప్ మృతి చెందాడు. కుక్క గోరు గీరినప్పుడు నిర్లక్ష్యం వహించడం వల్లే తమ కుమారుడి ప్రాణాలు పోయాయని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ఆ గ్రామంలో విషాదం నింపింది. కుక్క కరిచినా, గోరు గీసినా వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.