Yadagirigutta: తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు మరో సదుపాయం సమకూరనున్నది. పర్వతమాల పరియోజన ప్రాజెక్టులో భాగంగా గుట్టపైకి వెళ్లేందుకు రోప్‌వే ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. యాదగిరిగుట్టతోపాటు మరో మూడు చోట్ల రోప్‌వేలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ముఖ్యంగా యాదగిరిగుట్టకు వెళ్లే భక్తులకు ట్రాఫిక్ రద్దీ తగ్గి, త్వరగా దర్శనం చేసుకునే భాగ్యం కలగనున్నది.
Yadagirigutta: పవిత్ర క్షేత్రంగా భక్తులతో కొనియాడబడుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని పునరుద్ధరించిన తర్వాత అనేక సౌకర్యాలు కలిగాయి. అయితే కొండపైకి వెళ్లేందుకు భక్తులు చాలాసార్లు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కొని తీవ్ర జాప్యం అవుతుంది. దీంతో గంటల కొద్ది వేచి ఉండాల్సి వస్తున్నది. దైవదర్శనానికి ఆలస్యం అవుతుంది.
Yadagirigutta: పర్వతమాల పరియోజన ప్రాజెక్టులో భాగంగా రోప్‌వే ఏర్పాటైతే పై సమస్యలన్నీ తీరుతాయి. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పరిధిలోని జాతీయ రహదారుల లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్‌కు ఈ రోప్‌వే నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తూ కేంద్రం ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకున్నది. ఈ మేరకు ఈ ప్రాజెక్టులో భాగంగా ఆ సంస్థ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వరకు 1.1 కిలోమీటర్ల రోప్‌వేను నిర్మంచనున్నది.
Yadagirigutta: అదే విధంగా హనుమకొండలో 1.2 కిలోమీటర్లు, నల్లగొండ జిల్లాలోని నాగార్జున కొండ నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ వరకు 1.7 కిలోమీటర్లు, పెద్దపల్లి జిల్లా మంథనిలోని రామగిరికోటకు 2.4 కిలోమీటర్ల మేర నూతనంగా రోప్‌వే ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేయనున్నారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక కోసం ఎన్హెచ్ఏఐ బిడ్లను కూడా ఆహ్వానించింది. ఈ బిడ్లకు అక్టోబర్ 21 వరకు అవకాశం కల్పించారు.