Gadwal: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ లో ఈ రోజు ఉదయం విషాదం చోటు చేసుకుంది. కలుషితమైన ఆహారం తినడం వల్ల ఏకంగా 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
బాధిత విద్యార్థులను వెంటనే చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ 15 మందిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.
ఉప్మాలో పురుగులు, ఆ తర్వాత అరటిపండ్లు
విద్యార్థులు చెప్పిన వివరాల ప్రకారం, ఈ రోజు ఉదయం వసతిగృహంలో ఉప్మా వడ్డించారు. ఆ ఉప్మాలో పురుగులు కనిపించాయని, ఈ విషయాన్ని వారు హాస్టల్ వార్డెన్‌కు చెప్పడంతో, ఆ ఉప్మాను పారేశారని తెలిపారు.
ఆ తర్వాత, విద్యార్థులు అరటిపండ్లు, బిస్కెట్లు తిని యథావిధిగా పాఠశాలకు వెళ్లారు. స్కూల్‌కి వెళ్లిన అరగంట తర్వాత వారికి కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వసతిగృహంలో కలుషిత ఆహారం ఇవ్వడంపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

