World Smallest Ganesh Idol

World Smallest Ganesh Idol: ప్రపంచంలోనే అతి చిన్న వినాయక విగ్రహం.. ఖరీదు తెలిస్తే నోరెళ్లబెడతారు..!

World Smallest Ganesh Idol: వినాయక చవితి రాగానే ప్రతి చోటా భక్తి ఉత్సాహం అలుముకుంటుంది. ఊరూవాడా, గల్లీ వీధులన్నీ గణపయ్య కోలువై భక్తులను కరుణిస్తుంటాయి. ఒకరికి పోటీగా మరొకరు అతి ఎత్తైన గణనాథ విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. అయితే, ఈసారి సూరత్‌కు చెందిన ఓ నగల వ్యాపారి విభిన్న ఆవిష్కరణతో భక్తుల దృష్టిని ఆకర్షించారు. భారీ విగ్రహాలకే కాదు, అతి చిన్న విగ్రహాలకూ తనదైన ముద్ర వేశారు.

ఒక అంగుళం ఎత్తులో బంగారు గణపతి, లక్ష్మీదేవి

సూరత్‌లోని ఖుషల్‌బాయ్ జ్యువెలర్స్ యజమాని విరెన్ చోక్సీ ఆధ్వర్యంలో 40 మంది కళాకారుల బృందం కలసి ప్రపంచంలోనే అతి చిన్న బంగారు గణేశుడు, లక్ష్మీదేవి విగ్రహాలను రూపొందించారు. వీటి ఎత్తు కేవలం 1 అంగుళం, బరువు 10 గ్రాములు మాత్రమే. వీటిని అత్యాధునిక 3D ప్రింటింగ్ టెక్నాలజీతో, ఎలాంటి లోపాలు లేకుండా ‘జీరో డిఫెక్ట్’ నాణ్యతతో తీర్చిదిద్దారు.

22 క్యారెట్ల బంగారంతో తయారీ

ఈ విగ్రహాల తయారీలో స్వచ్ఛమైన 22 క్యారెట్ల బంగారంను ఉపయోగించారు. అతి చిన్న పరిమాణంలోనూ విగ్రహం రూపం, ముఖ కవళికలు, అలంకరణలు స్పష్టంగా కనిపించేలా తీర్చిదిద్దడం ప్రత్యేకత. సాధారణంగా 10 అడుగుల గణేశుడిలో కనిపించే స్పష్టతను, ఈ 1 అంగుళం విగ్రహంలోనూ చూడవచ్చని వ్యాపారి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Vinayaka Chavithi 2025: వినాయక చవితి రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి

15–20 రోజుల కృషి, భారీ డిమాండ్

ఈ విగ్రహాలను తయారు చేయడానికి దాదాపు 15 నుంచి 20 రోజులు పట్టింది. కళాకారులు పగలు–రాత్రి శ్రమించి రూపొందించారు. ఒక్కో విగ్రహం ధర దాదాపు ₹1.5 లక్షలు. అయినప్పటికీ, గణేష్ చతుర్థి, దీపావళి పండుగల ముందు వీటికి భారీ డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే అనేక ఆర్డర్లు పూర్తవ్వగా, ఇంకా కొత్త ఆర్డర్లు వరుసగా వస్తున్నాయి.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం కోసం దరఖాస్తు

ఈ విగ్రహాల ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకునేందుకు దరఖాస్తు చేశారు. దీనితో సూరత్ నగల కళాకారుల సృజనాత్మకత మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందబోతోందని చెబుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *