Kamareddy: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి పథకం’ కింద ఉచిత బస్సు ప్రయాణంపై వింత నిరసన వ్యక్తమైంది. ఈ పథకాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి బస్టాండ్లో శనివారం మహిళలు ధర్నాకు దిగారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళల మధ్య గొడవలు పెరుగుతున్నాయని, తమకు అవసరం లేదని ఈ పథకాన్ని రద్దు చేయాలని వారు కోరారు.
మహిళల ఆవేదన
ఈ సందర్భంగా ఆందోళనకు దిగిన మహిళలు మాట్లాడుతూ.. ఉచిత ప్రయాణం వల్ల బస్సుల్లో విపరీతమైన రద్దీ ఏర్పడిందని, అవసరం లేనివారు కూడా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నిజంగా అవసరమైన విద్యార్థినులు, ఉద్యోగినులకు బస్సుల్లో సీట్లు దొరకడంలేదని వాపోయారు. ఉచిత ప్రయాణం కారణంగా కండక్టర్లు, డ్రైవర్లు మహిళలను చిన్నచూపు చూస్తున్నారని, మర్యాదగా మాట్లాడటం లేదని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు
ఈ పథకం వల్ల తాము కోటీశ్వరులమవుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ ఇప్పుడు రోడ్డున పడ్డామని మహిళలు విమర్శించారు. ఉచిత ప్రయాణం వల్ల మహిళల మధ్య అనవసరమైన గొడవలు జరుగుతున్నాయని, ఈ పథకాన్ని రద్దు చేయడమే మంచిదని డిమాండ్ చేశారు. మహిళలు స్వశక్తితో సంపాదించి బస్సు టికెట్లు కొనుక్కునే విధంగా ప్రోత్సహించాలని, అంతేగాని ఇలాంటి పథకాలతో మనుషుల మధ్య చిచ్చు పెట్టొద్దని వారు సూచించారు. ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయకుంటే తమ నిరసనను కొనసాగిస్తామని హెచ్చరించారు.


