Vizag: విశాఖలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి

Vizag: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం వేగంగా మొదలైంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల (సుమారు ₹1.25 లక్షల కోట్లు) భారీ పెట్టుబడితో విశాఖపట్నంలో తన డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఇది భారత చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ (FDI) అని ఆయన స్పష్టం చేశారు.

బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోకేశ్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా యావత్‌ భారతదేశానికే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద డేటా సెంటర్ ఇదేనని తెలిపారు.

ఉద్యోగాలు, ఆర్థిక ప్రభావం

ఈ ఒక్క పెట్టుబడితో రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1,88,000 ఉద్యోగాలు లభిస్తాయని లోకేశ్ తెలిపారు. రాబోయే ఐదేళ్లలో స్థానిక ఆర్థిక వ్యవస్థపై దాదాపు ₹48 వేల కోట్ల సానుకూల ప్రభావం చూపుతుందని వివరించారు.

“గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలను మార్చినట్లే, ఇప్పుడు గూగుల్ విశాఖ దశను మార్చబోతోంది” అని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.

ప్రాజెక్టు సాధనలో చంద్రబాబు పాత్ర

ఈ భారీ ప్రాజెక్టును సాధించడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత మరియు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి కృషి ఉందని ఆయన పేర్కొన్నారు. గూగుల్ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాల్లో కీలక సవరణలు చేసినట్లు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంపూర్ణ సహకారం అందించారని గుర్తుచేశారు. “రాష్ట్రంలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం ఉండటం వల్లే ఇంత వేగంగా పెట్టుబడులు ఆకర్షించగలుగుతున్నాం,” అని లోకేశ్ అన్నారు.

వైసీపీపై విమర్శలు

గత వైసీపీ ప్రభుత్వంపై లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. గూగుల్ ప్రాజెక్టు అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ఆ సంస్థకు వ్యతిరేకంగా మెయిల్స్ పంపారని ఆయన ఆరోపించారు.

“వారి ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి జరగలేదని, పెట్టుబడిదారులు భయపడి పారిపోయారని” విమర్శించారు.

తాము అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చామని తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఇకపై ప్రతి వారం ఒక కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని లోకేశ్ వెల్లడించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *