Vijayawada Metro Rail: ఆంధ్రప్రదేశ్ మెట్రోరైల్ కార్పొరేషన్ (APMRC) నుంచి కీలక ప్రకటన వచ్చింది. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు టెండర్ల గడువును పెంచారు. ఈరోజుతో ముగియాల్సిన టెండర్ల గడువును మరో పది రోజులు పొడిగించారు. అంటే, ఈ నెల 24వ తేదీ వరకు టెండర్లు వేసుకోవచ్చు. టెండర్లు దాఖలు చేయాలని చూస్తున్న నిర్మాణ సంస్థలకు ఇది మంచి ఉపశమనం కలిగించే వార్త.
టెండర్ల గడువును పెంచాలని కొన్ని కంపెనీలు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ (APMRC) తెలిపింది. విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ కోసం పెద్ద పెద్ద ఇన్‌ఫ్రా కంపెనీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
రెండు కారిడార్లకు ఒకే టెండర్:
ఏలూరు రోడ్, బందరు రోడ్ అనే రెండు కారిడార్లకు కలిపి APMRC ఒకే టెండర్ విధానంలో ప్రక్రియను మొదలుపెడుతోంది. సుమారు రూ. 4,500 కోట్ల ఖర్చుతో ఈ టెండర్లను ఆహ్వానించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే జరిగిన ప్రీ-బిడ్డింగ్ సమావేశంలో పదికి పైగా పెద్ద కంపెనీలు పాల్గొన్నాయి. కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలు కలిసి జాయింట్ వెంచర్ పద్ధతిలో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ముందుగా టెక్నికల్ బిడ్లు, ఆ తర్వాత ఫైనాన్షియల్ బిడ్లను తెరుస్తారు. ఎంపికైన సంస్థలు స్థల పరిశోధన (టోపోగ్రఫీ), భౌగోళిక సర్వేలు, మట్టి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ సర్వేలకు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టవచ్చని అంచనా.
కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే మెట్రో నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయి. ఏలూరు రోడ్డుపై డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించేందుకు కూడా APMRC ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రాజెక్టు వివరాల నివేదిక (DPR)ను ఇప్పటికే కేంద్ర ఉపరితల రవాణా శాఖకు పంపించారు. కేంద్రం అనుమతులు ఇస్తే, విజయవాడ మెట్రో పనులు వేగంగా ముందుకు సాగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.