Crime News: విజయవాడ నగరాన్ని కుదిపేసిన పిన్ని హత్య కేసు భయానక వివరాలు బయటపడ్డాయి. ఊర్మిళ నగర్‌కు చెందిన పొత్తూరి విజయలక్ష్మి (65) మిస్సింగ్ కేసుగా మొదట నమోదు అయిన ఈ ఘటన, చివరికి క్రూర హత్యగా మారింది. ఈ ఘటనలో నిందితులుగా విజయలక్ష్మి సోదరి కుమారుడు హనుమాన్ సుబ్రహ్మణ్యం, అతని కుమారుడిని బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హత్యకు ముందు పక్కా ప్రణాళిక
విజయలక్ష్మి గత నెల 30న చిట్టినగర్‌లోని వాసవి కల్యాణ మండపంలో జరిగిన ఒక వివాహానికి హాజరయ్యారు. కానీ తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె కుమారుడు రవి భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొదట మిస్సింగ్ కేసుగా విచారణ ప్రారంభించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హత్య మిస్టరీని ఛేదించారు.
విచారణలో షాకింగ్ వివరాలు బయటపడ్డాయి సుబ్రహ్మణ్యం కుమారుడు విజయలక్ష్మిని కళ్యాణ మండపం నుంచి ద్విచక్రవాహనంపై భవానీపురంలోని హెచ్‌బీ కాలనీలోని తమ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ సుబ్రహ్మణ్యం ముందుగానే ప్రణాళిక వేసి మత్తుమందు ఇచ్చి విజయలక్ష్మిని స్పృహ తప్పించాడు. ఆ తర్వాత పీకకోసి హత్య చేశాడు. అనంతరం మామిడికాయలు సరికే కత్తితో శరీరాన్ని ముక్కలుగా చేసి సంచుల్లో వేసి బైక్‌పై బొమ్మసానినగర్ పరిసర ప్రాంతాల్లో పడేశాడు.
దర్యాప్తులో బయటపడ్డ షాకింగ్ వివరాలు
విజయలక్ష్మి తల, చేతులు, కాళ్లు వేర్వేరు ప్రదేశాల్లో మురుగు కాల్వల్లో పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు సుబ్రహ్మణ్యం తండ్రి-కొడుకును అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: AP News: పొట్టిగా ఉన్నాడని.. బావను దారుణంగా చంపిన బావమరిది
హత్య వెనుక ఆస్తి, ప్రతీకార కోణం
సుబ్రహ్మణ్యం భార్య 10 ఏళ్ల క్రితం అతడిని విడిచి వెళ్లి పోయింది. అప్పుడు ఆమెతో పాటు సుమారు 650 గ్రాముల బంగారం తీసుకెళ్లిందట. ఆ సమయంలో సుబ్రహ్మణ్యం భార్యకు పిన్ని విజయలక్ష్మి మద్దతుగా నిలిచారు. దీంతో ఆమెపై సుబ్రహ్మణ్యం తీవ్ర కక్ష పెంచుకున్నాడు.
తరువాత ఆ బంగారం కేసును కోర్టు కొట్టేయడంతో పాటు, అతడు తన మేనమామ రాంబాబు ఇంట్లో ఉండగా ఆ ఇల్లు తనదేనని చెప్పడం, రాంబాబు హెచ్చరించడం. ఈ గొడవల్లోనూ విజయలక్ష్మి పేరు రావడం అతడిని మరింత ఆగ్రహానికి గురి చేసింది. చివరికి పగ, ప్రతీకారం కలగలిపి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
పోలీసులు ఏం చెబుతున్నారు?
“విజయలక్ష్మి మిస్సింగ్ కేసు వెనుక కుటుంబ విభేదాలు, ఆస్తి తగాదాలే ఉన్నాయని అనుమానం వచ్చిందని, దర్యాప్తులో అన్ని ఆధారాలు నిందితుల వైపుకే చూపించాయి,” అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందిత తండ్రి-కొడుకును రిమాండ్‌కు తరలించగా, ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.