Venkaiah Naidu: భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా మాట్లాడుతూ, ఆ గొప్ప నాయకుడి త్యాగాలను, దేశానికి చేసిన సేవలను కొనియాడారు. సర్దార్ పటేల్ నిజంగా ఒక ఉక్కు మనిషి అని, దేశ సమైక్యతకు ఆయనే అసలైన శిల్పి అని వెంకయ్య నాయుడు గారు అన్నారు. ఆయన ఆలోచనలు, సంస్కరణలు ఇప్పటికీ దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. దేశానికి మొదటి ప్రధానమంత్రి అయ్యే గొప్ప అవకాశం పటేల్‌కే దక్కిందని, అప్పట్లో ఉన్న 15 రాష్ట్రాలలో 14 రాష్ట్రాలు ఆయనే ప్రధాని కావాలని కోరుకున్నాయని తెలిపారు. అయినా, జాతిపిత మహాత్మా గాంధీ కోరిక మేరకు, పటేల్ ప్రధానమంత్రి పదవిని వదులుకున్నారు. ఇది ఆయన గొప్ప త్యాగానికి నిదర్శనం.
పటేల్ చేసిన అతి ముఖ్యమైన పని ఏంటంటే, దేశంలోని 565 సంస్థానాల రాజులతో మాట్లాడి, వారందరినీ ఒప్పించి భారతదేశాన్ని ఒకే తాటిపైకి తీసుకురావడం. ఈ ఘనత కేవలం పటేల్‌కే దక్కింది. ఆ రోజుల్లో బ్రిటిష్ వారి కుతంత్రాలకు లోనై, హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటిస్తానని నిజాం రాజు ప్రకటించాడు. అప్పుడు, నిజాంకు లొంగిపోవడానికి కేవలం 48 గంటల సమయం ఇచ్చారు సర్దార్ పటేల్. చివరికి, ‘ఆపరేషన్ పోలో’ ద్వారా నిజాం నడ్డి విరిచి, హైదరాబాద్‌ను భారతదేశంలో కలిపిన ఘనత కూడా పటేల్‌దే. దేశం ఎప్పుడూ ఐక్యతతో ముందుకు సాగాలని, అదే మనం పటేల్‌కు ఇచ్చే అతి పెద్ద గౌరవం అని వెంకయ్య నాయుడు గారు అన్నారు. దేశ యువతరం పటేల్ జీవితాన్ని తప్పకుండా స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే, మొంథా తుఫాన్ బాధితులకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన కోరారు.


