Varun Chakravarthy: మన టీమిండియాలో మిస్టర్ స్పిన్నర్ గా పేరు తెచ్చుకున్నా అంతర్జాతీయంగా రాణించలేక పోవడంతో వరుణ్ చక్రవర్తి పని ఖతమైందని అంతా అనుకున్నారు. కానీ పడిలేచిన తరంగంలా అతను మళ్లీ దూసుకువచ్చాడు. ఒకప్పటితో పోలిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కావలసిన బౌలింగ్ మెలకువలను అందిపుచ్చుకున్నాడు. మూడేళ్ల క్రితం వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ గా గుర్తింపు తెచ్చుకొని భారత జట్టులోకి ఎంపికయ్యాడు. శ్రీలంకతో టి20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో పొదుపైన బౌలింగ్ ప్రదర్శన కనబర్చడంతో కొద్ది రోజులకే యూఏఈలో జరిగిన టి20 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం కూడా దక్కింది. అయితే 3 మ్యాచ్‌లలో కలిపి 11 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దాంతో అతను తీవ్ర విమర్శలపాలై సెలక్టర్ల నమ్మకం కోల్పోయాడు. జట్టులో స్థానం చేజార్చుకున్న అతను ఐపీఎల్‌లో మాత్రం ఆకట్టుకున్నాడు. 2024 ఐపీఎల్‌లో మళ్లీ సత్తా చాటి కోల్‌కతా నైట్‌రైడర్స్ టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించడంతో ఎట్టకేలకు మళ్లీ టీమిండియా చాన్స్ లభించింది. పునరాగమంలో ఆడిన 5 టి20ల్లో కలిపి 13 వికెట్లతో వరుణ్ సత్తా చాటాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో రెండో టి20 మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో ఈ మిస్టర్ స్పిన్నర్ పేరు క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతోంది.
Varun Chakravarthy: మూడేళ్ల క్రితం భారత జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత వరుణ్ చక్రవర్తి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ కష్టకాలాన్ని అధిగమించాలంటే మరింత ఎక్కువ క్రికెట్ ఆడటమే అని అర్థం చేసుకుని తీవ్రంగా శ్రమించాడు. టీఎన్‌పీఎల్ వంటి దేశవాళీ లీగ్‌లలో పాల్గొన్నాడు. దీంతో అతని ఆటను మరింత అర్థం చేసుకునేందుకు, ఆపై మెరుగు పర్చుకునేందుకు ఉపకరించింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడిన సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన బాధ్యతలపై స్పష్టత ఇవ్వడం అతని బౌలింగ్ కు మరింత మేలు చేసింది. 30, 40 పరుగులు ఇచ్చినా బాధ లేదు కానీ వికెట్ల తీయడమే నీ పని అంటూ నా బాధ్యత ఏమిటో గంభీర్ స్పష్టంగా చెప్పడంతో అది పాటించి వికెట్లు తీస్తున్నానని వరుణ్ చెబుతున్నాడు. అంతేకాదు వరుసగా విఫలమవుతుండటంతో నా బౌలింగ్ వీడియోలను మళ్లీ పరిశీలించా. సైడ్ స్పిన్ వేస్తున్నానని, అది అత్యున్నత స్థాయిలో పనిచేయడం లేదని తెలుసుకుని ఆ తర్వాత నా బౌలింగ్‌ను పూర్తిగా మార్చుకున్నానని, అందుకు రెండేళ్లు పట్టిందని చెబుతున్నాడు ఈ మిస్టరీ స్పిన్నర్
Varun Chakravarthy: స్థానిక లీగ్‌ల్లో, ఐపీఎల్‌లో మార్చుకున్న కొత్త స్టైల్ తో బౌలింగ్ చేయడం మొదలెట్టిన వరుణ్ చక్రవర్తికి అక్కడ మంచి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ అదే స్థాయిలో వికెట్ల పంట పండిస్తున్నాడు. నిలకడ, ఓవర్ స్పిన్‌తో సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో అయిదు వికెట్ల ఘనత దక్కింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఐపీఎల్‌లో ఆడే వరుణ్.. గత రెండు సీజన్లలో వరుసగా 20, 21 వికెట్లు తీశాడు. ఈ సీజన్‌లో జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అప్పుడు జట్టు మెంటార్‌గా ఉన్న గంభీర్ ఆ తర్వాత టీమిండియా కోచ్ గా రావడంతో వరుణ్ కు మళ్లీ చాన్స్ వచ్చింది. బంగ్లాదేశ్ తో టీ20 సమయంలోనే కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ సలహాలతో వికెట్లు తీయడమే లక్ష్యంగా బౌలింగ్ చేయడంతో ఫలితాలు వచ్చాయని ఆనందంగా అంటున్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ విరామంలో ఫలితం గురించి పట్టించుకోకుండా ఉత్తమ ప్రదర్శన చేద్దామని సూర్యకుమార్ చెప్పాడు. మేం అందుకే ప్రయత్నించాం. తక్కువ స్కోరు ఉన్నప్పుడు దూకుడుగానే ఆడాలి. వికెట్లు తీస్తేనే గెలుస్తామని దూకుడుగా బౌలింగ్ చేసి 5 వికెట్ల ప్రదర్శన చేసినట్లు వివరించాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.