తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో అధికారులపై జరిగిన దాడి ఘటనపై గ్రామం చుట్టూ పోలీసులు అర్ధరాత్రి నుంచే గాలింపు చర్యలు చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని వరుసబెట్టి అరెస్టు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 55 మంది రైతులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గ్రామ పరిసరాల్లో, పొలాల్లో దాక్కున్న రైతులను వెతికి మరీ పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నారు.
ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూసేకరణ కోసం గ్రామానికి కలెక్టర్, ఇతర అధికారులు వచ్చి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న రైతులు, గ్రామస్థులు అధికారులపైనే తిరగబడ్డారు. దీంతో పోలీసులు బాధ్యులైన రైతుల అరెస్టులకు దిగారు. ఈ మేరకు కొడంగల్, దుద్యాల, బొంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు.
సోమవారం సంఘటన జరిగిన అనంతరం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో లగచర్ల గ్రామానికి 300 మందికి పైగా పోలీసులు చేరుకున్నారని సమాచారం. అదేరాత్రి 28 మందిని అరెస్టు చేసి పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంగళవారం రోజు ఇతరులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో పోలీసు ఉన్నతాధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు సమాచారం.