Dil Raju Dreams: ‘ప్రపంచమొక పద్మవ్యూహం… కవిత్వమొక తీరని దాహం’ అంటాడు మహాకవి శ్రీశ్రీ. సినిమా రంగమొక పద్మవ్యూహం అయితే… చిత్ర నిర్మాణమనేది తీరని దాహం అనుకోవాల్సి ఉంటుంది. ఆ తీరని దాహంతోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు తపిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై కమర్షియల్ సినిమాలను, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రయోగాత్మక చిత్రాలు తీస్తున్నా… ఆయన దాహం తీరడం లేదు. అందుకే ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అనే సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించే నిమిత్తం ఓ వైబ్ సైట్ ను ఏర్పాటు చేసి, వారితో కలిసి సినిమాలను నిర్మించే ఆలోచన చేస్తున్నారు. కనీసం ఈ బ్యానర్ లో సంవత్సరానికి ఐదు సినిమాలు నిర్మించాలన్నది ఆయన కోరిక. కంటెంట్ తో తమ దగ్గరకు వస్తే దానిని అనుభవజ్ఞులతో స్క్రుటినీ చేసి, వెండితెరకెక్కించేందుకు తన వంతు సాయం చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ప్రవాస భారతీయులు రెండు సినిమాలు చేయబోతున్నారని దిల్ రాజు తెలిపారు.