Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలం వెలగపూడిలో కొత్తగా నిర్మించిన సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అనిత, తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ కొత్త ఆఫీసు తెరవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే, ఈ భవనం గురించి ప్రత్యేకంగా చెప్పాలి.
2014లో అప్పటి సీఎం చంద్రబాబు అమరావతిని ప్రారంభించినా, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యాలయం పూర్తి కాకుండా ఉండిపోయింది అని ఆమె గుర్తు చేశారు. రాజధాని కోసం రైతులు తమ భూములను త్యాగం చేయడం గొప్ప విషయం అని మంత్రి అనిత కొనియాడారు. అమరావతి రైతుల కష్టం ఫలితమే ఇవాళ అందరూ చూస్తున్నారని, ఈ బిల్డింగ్‌ను పూర్తి చేయడానికి ఎస్పీ వకుల్ జిందాల్, డీఎస్పీ మురళీ కృష్ణ చాలా కష్టపడ్డారని ఆమె అభినందించారు.
Also Read: Gold Price Today: బంగారం కొనేవారికి గోల్డెన్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు!
పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు డీజీపీ గారు కృషి చేస్తున్నారని, పోలీసులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అనిత హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా, పోలీసులకు కోటి రూపాయల వరకు భీమా కల్పించామని ఆమె వెల్లడించారు. అలాగే, ఈ మధ్యకాలంలో కల్పిత వీడియోల ద్వారా చాలా మంది ఇబ్బంది పెడుతున్నారని, అలాంటి వాటిని ఏపీ పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని హోంమంత్రి అనిత తెలిపారు. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్‌లో లారీపై రాళ్లు వేసిన వీడియోను కూడా ఏపీలో జరిగినట్లు వైసీపీ ప్రచారం చేసిందని ఆమె పేర్కొన్నారు.
ఇలాంటి తప్పుడు ప్రచారాలను పోలీసులు ధీటుగా ఎదుర్కొన్నారని, టెక్నాలజీని ఉపయోగించి తప్పుడు వార్తలు వ్యాప్తి కాకుండా చూడాలని సీఎం గారు ఆదేశించారని అనిత చెప్పారు. తమ కూటమి ప్రభుత్వం వచ్చాకే 6,100 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చామని, కానీ వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆమె విమర్శించారు. చనిపోయిన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, బీమా ద్వారా కనీసం రూ.15 లక్షలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సబ్ డివిజన్లో ఉన్న సిబ్బంది కొరతను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.

