Uttam Kumar Reddy: రాష్ట్ర సాగునీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి, హుజూర్‌నగర్ ఎమ్మెల్యే అయిన నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఓ సువర్ణావకాశాన్ని కల్పించనున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత కోసం అక్టోబర్ 25వ తేదీన మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. తన నియోజకవర్గ కేంద్రమైన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో ఈ మెగా జాబ్‌మేళాను ఏర్పాటు చేయనున్నారు. ఒక్క హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలే కాకుండా, ఉమ్మడి నల్లగొండ జిల్లా నిరుద్యోగులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.
Uttam Kumar Reddy: హుజూర్‌నగర్ పట్టణంలోని పెర్ల్ ఇంటర్నేషనల్ స్కూల్ (సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెనుక, స్వర్ణవేదిక ఫంక్షన్ హాలు పక్కన) అక్టోబర్ 25న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మేళా జరుగుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నిర్వాహకులు తెలిపారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్), తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ (డీఈఈటీ) సంయుక్త సహకారంతో ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
Uttam Kumar Reddy: హుజూర్‌నగర్ పట్టణంలో నిర్వహించే జాబ్‌మేళాలో 150 వివిధ కంపెనీలు పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ జాబ్‌మేళాలో పాల్గొన్న అర్హతలు కలిగిన నిరుద్యోగుల్లో సుమారు 5,000 మంది వరకు ఆయా కంపెనీలు ఉద్యోగులుగా నియమించుకుంటాయని తెలిపారు. పాల్గొనే అభ్యర్థులు 18 ఏళ్ల వయసు నుంచి 40 ఏళ్లలోపు వారై ఉండాలని సూచించారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, పీజీ, ఫార్మసీ విద్యార్హతలు కలిగిన వారు పాల్గొన వచ్చునని తెలిపారు.
Uttam Kumar Reddy: ఇప్పటికే మెగా జాబ్‌మేళా పోస్టర్‌ను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. జాబ్‌మేళా విజయవంతం కోసం పలు కమిటీలను మంత్రి ఏర్పాటు చేశారు. తన జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న సత్సంకల్పంతో తాను ఈ కార్యక్రమానికి చొరవ తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ సదవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.