US Flights: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో (USA) విమాన ప్రయాణాలు చేయాలనుకునే వారికి గడ్డుకాలం ఎదురైంది. ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావంతో పాటు, తరచూ తలెత్తుతున్న సాంకేతిక లోపాల కారణంగా దేశవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శుక్రవారం నుంచి ఏకంగా 1,800 విమాన సర్వీసులను రద్దు చేయాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రకటించింది.
అమెరికాలో విమానాల రాకపోకల్లో అంతరాయానికి ప్రధాన కారణం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లపై (ATC) పెరుగుతున్న పని భారం. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమైన ప్రభుత్వ షట్‌డౌన్ వల్ల కంట్రోలర్లు జీతాలు లేకుండానే విధి నిర్వహణలో పాల్గొనాల్సి వస్తోంది. ఆరు రోజుల పాటు వారపు సెలవులు లేకుండా బలవంతంగా ఓవర్ టైమ్ డ్యూటీలు చేస్తుండటంతో, సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
చాలా మంది ఉద్యోగులు అనారోగ్య కారణాల వల్ల సెలవు తీసుకోవడంతో, విమాన రాకపోకల నిర్వహణ కష్టమైంది. ఈ పరిస్థితిలో విమాన భద్రతను కాపాడటం కోసం రద్దీని తగ్గించాలని FAA ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా నిత్యం అత్యంత రద్దీగా ఉండే 40 విమానాశ్రయాల్లో 10 శాతం విమానాలను రద్దు చేయనున్నారు. ఈ చర్య ద్వారా మొత్తం 1,800 విమాన సర్వీసులు రద్దు కానున్నాయి.
Also Read: Bandi Sanjay: కరీంనగర్ టెన్త్ విద్యార్థులకు “మోదీ గిఫ్ట్” పేరుతో బండి సంజయ్ ఆర్థిక సాయం
ఎఫ్‌ఏఏ అడ్మినిస్ట్రేటర్ బ్రయాన్ బెడ్‌ఫోర్డ్ మాట్లాడుతూ, తన 35 ఏళ్ల ఏవియేషన్ చరిత్రలో ఇలాంటి తీవ్రమైన చర్యను ఎన్నడూ చూడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ కూడా ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ, పరిస్థితి మరింత అదుపు తప్పితే అదనపు ఆంక్షలు కూడా విధించాల్సి వస్తుందని హెచ్చరించారు.
షట్‌డౌన్ ప్రభావంతో పాటు, టెలికాం రంగంలో వచ్చిన లోపాలు కూడా విమాన సేవలకు అంతరాయం కలిగించాయి. ఒక స్థానిక టెలికాం కంపెనీ పరికరాల్లో సమస్య తలెత్తడం వల్ల డాలస్ సహా పలు విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు దెబ్బతిన్నాయి.
డాలస్ విమానాశ్రయంలో సుమారు 20 శాతం విమానాలు రద్దయ్యాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 200కు పైగా విమానాలు రద్దు కాగా, మరో 500కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 1,100కు పైగా విమానాలు కూడా ఆలస్యమైనట్లు ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థలు తెలిపాయి.
విమాన భద్రత, రాకపోకల వ్యవస్థను మెరుగుపరచడానికి అమెరికా ప్రభుత్వం గతంలోనే $12.5 బిలియన్ల నిధులను మంజూరు చేసినప్పటికీ, ఈ ఏడాది FAA కమ్యూనికేషన్ వ్యవస్థలో తరచుగా సమస్యలు తలెత్తుతుండటం గమనార్హం.

