Hyderabad: హైదరాబాద్ శివారు జీడిమెట్ల పారిశ్రామికవాడలో విషాదం చోటుచేసుకుంది. మూతపడ్డ పరిశ్రమలో పనులు చేస్తూ రసాయనాల ట్యాంకులో పడి కవలలు దుర్మరణం చెందారు. జీడిమెట్ల డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కనకయ్య వివరాలు తెలిపారు.
ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోణ మండలం దొంతికూరకు చెందిన రామ్, లక్ష్మణ్ కవలలు. ఉపాధి కోసం నగరానికి వచ్చి శివారులోని గుండ్లపోచంపల్లిలో ఉంటూ కూలీలుగా పనిచేస్తున్నారు. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని మూతపడ్డ సాబూరి ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధలో ఫ్యాబ్రికేషన్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను గుత్తేదారు నారాయణరావు చేయిస్తున్నారు. ఇతడి వద్ద రామ్ లక్ష్మణ్‌లు పనిచేస్తున్నారు.
కంపెనీకి చేరుకుని ఓ షెడ్డుకు ఉన్న పైపులను తొలగిస్తున్న క్రమంలో రామ్ అదుపుతప్పి కింద ఉన్న ప్రమాదకర రసాయనాలు నిల్వ ఉన్నట్యాంకులో పడిపోయాడు. రసాయనాలు మింగ్ రామ్ ఉక్కిరిబిక్కిరి అవ్వడంతో గమనించిన లక్ష్మణ్ రామ్‌ను కాపాడేందుకు సంపులోకి దిగాడు. అతన్ని వెలికి తీస్తున్న సమయంలో కొంత రసాయనం లక్ష్మణ్ నోట్లోకి వెళ్లింది. స్పృహ కోల్పోయిన రామ్‌ను బయటకు తీసిన లక్ష్మణ్..నోట్లో నుంచి నురగలు కక్కుకుంటూ అక్కడే చనిపోయాడు. వీరిద్దర్ని కాపాడే ప్రయత్నంలో మరో కార్మికుడు వెంకట్రామ్రెడ్డి రసాయనం బారిన పడ్డాడు.
మిగిలిన కార్మికులు గమనించి సమీప షాపూర్ నగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రామ్, లక్ష్మణ్ మృతి చెందినట్లు నిర్థారించారు. వెంకట్రామ్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్యాంకులో నిల్వ చేసిన రసాయనం ఏమిటన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.
ఇద్దరి మృతికి కారణమైన సాబూరి పరిశ్రమ నాలుగేళ్లుగా మూసివేసినట్లు జీడిమెట్ల పోలీసుల విచారణలో తేలింది. కొన్ని రోజులుగా ఆధునీకరణ పనులను చేపడుతున్నారు. సంస్థ ఆవరణలోని ట్యాంకులో ప్రమాదకర రసాయనాలు ఎలా నిల్వ ఉన్నయనేది అర్థంకావడం లేదు. రసాయన నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఘటనకు బాధ్యులైన గుత్తేదారు నారాయణరావు, పరిశ్రమ నిర్వహకుడు సతీష్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.