Bhupalpalli: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇటీవల జరిగిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కలుషిత నీరు తాగి 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో ఊహించని ట్విస్ట్ బయటపడింది. విద్యార్థులకు ఇలా కావడానికి కారణం ప్రిన్సిపాల్, సైన్స్ టీచర్ మధ్య జరిగిన గొడవలే అని తేలింది.
ఏమి జరిగింది?
కొన్ని రోజుల క్రితం గాంధీనగర్ స్కూల్లోని విద్యార్థులు కలుషిత నీరు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపు నొప్పి లాంటి లక్షణాలతో బాధపడుతున్న విద్యార్థులను హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారిని పరీక్షించగా, తాగునీటిలో ఎవరైనా మోనో మందు కలిపినట్లు గుర్తించారు.
ఈ విషయంపై అధికారులు విచారణ ప్రారంభించగా, అసలు విషయం బయటపడింది. స్కూల్లో సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్న రాజేందర్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. ప్రిన్సిపాల్‌తో గొడవ పడి కోపం పెంచుకున్న రాజేందర్, ఆ కోపంలో వాటర్ ట్యాంకులో మోనో మందు కలిపినట్లు ఒప్పుకున్నాడు.
కుట్ర ఇలా మొదలైంది
ఈ నేరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు రాజేందర్ ఒక ప్లాన్ వేశాడు. వాటర్ ట్యాంకులో మందు కలిపిన తరువాత, తానే ముందు ఆ నీటిని తాగి అందరినీ నమ్మించాడు. అయితే, మందు ప్రభావం వల్ల రాజేందర్ కూడా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విద్యార్థులతో పాటు అతను కూడా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం 13 మంది విద్యార్థులు, టీచర్ రాజేందర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read: Kukatpally Murder Case: హత్య చేసిన తర్వాత కత్తి ని కడిగాను.. సహస్ర హత్యకేసులో విస్తుపోయే నిజాలు
ఈ ఘటన గురించి విద్యార్థులు మాట్లాడుతూ, సైన్స్ టీచర్ రాజేందర్ తమను తరచుగా చిత్రహింసలకు గురి చేసేవాడని, దారుణంగా కొట్టేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం స్కూల్లోని పెద్దల మధ్య ఉన్న గొడవల వల్ల అమాయకులైన విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


