TTD: తిరుమల శ్రీవారిని కాస్త దగ్గరగా చూసుకోవాలన్నా, వీఐపీ బ్రేక్ దర్శనం దక్కాలన్నా భక్తులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. స్వామివారిపై ఉన్న ఆ అపరిమితమైన భక్తిని, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారం చేయాలని చూసింది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ.
“మా ప్రాజెక్ట్‌లో ప్లాట్ కొంటే, జీవితాంతం తిరుపతి వేంకటేశ్వర స్వామి వీఐపీ బ్రేక్ దర్శనం ఫ్రీగా కల్పిస్తాం” అంటూ ‘SCP Developers’ అనే సంస్థ సోషల్ మీడియాలో ఒక రీల్ వదిలింది. తిరుపతి హైవేలో ప్లాట్ల అమ్మకాల కోసం శ్రీవారి పేరును వాడుకుంటూ ఇచ్చిన ఈ ‘ల్యాండ్‌మార్క్ ఆఫర్’ నెట్టింట తెగ వైరల్ అయింది. దీనిపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రచారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దృష్టికి వెళ్లడంతో అధికారులు వెంటనే స్పందించారు. ఈ ప్రచారంతో టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. వ్యాపార లాభాల కోసం స్వామివారి పేరును, దర్శనాల పేరును వాడుకునే హక్కు ఏ ప్రైవేటు వ్యక్తులకు లేదా సంస్థలకు లేదని స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనాలు, సేవలన్నీ కేవలం టీటీడీ అధికారిక నిబంధనల ప్రకారమే జరుగుతాయని తెలిపారు.
విజిలెన్స్ అధికారులు ఈ విషయంపై ఆరా తీయడం మొదలుపెట్టగానే, ఆ సంస్థ సోషల్ మీడియా నుంచి ఆ రీల్‌ను తొలగించింది. అయినప్పటికీ, స్వామివారి ప్రతిష్ఠను దెబ్బతీస్తూ భక్తులను మోసం చేయడానికి యత్నించినందుకు ఆ సంస్థపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని టీటీడీ వెల్లడించింది.
భక్తులు ఇలాంటి మోసపూరిత ప్రకటనలను, సోషల్ మీడియా రీళ్లను నమ్మి మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. దర్శనం టికెట్లు లేదా ఇతర సేవల కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే సంప్రదించాలని సూచించింది. మన భక్తి మనకు పవిత్రమైనది, దానిని వ్యాపార ప్రకటనల పేరుతో ఎవరైనా దుర్వినియోగం చేస్తే అప్రమత్తంగా ఉండడం మన అందరి బాధ్యత!
